రబీ ఆయకట్టుకు నీరివ్వడానికి మొదటిసారిగా అవకాశం

0rabiహైదరాబాద్‌: దేవాదుల కింద రబీ ఆయకట్టుకు నీరివ్వడానికి మొదటిసారిగా అవకాశం లభించింది. తుపాకులగూడెం బ్యారేజి నిర్మాణంతో దేవాదుల పంపుహౌస్‌ వద్ద నీటిమట్టం పెరగడంతో రబీలో ఆయకట్టుకు నీరందడానికి అవకాశం వచ్చింది. ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సమయంలోనే రబీకి నీటిని విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని మూడు దశల్లో చేపట్టారు. ప్రస్తుతం రెండు దశల పనులు పూర్తయి నీటిని తీసుకొంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎనిమిది టీఎంసీల నీటిని మళ్లించినట్లు తెలిసింది. మూడో దశ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దేవాదుల వద్ద గోదావరి నీటిమట్టం 71 మీటర్లకు పైన ఉంటే పంపులు పని చేస్తాయి. నాలుగు నెలలకు మించి ఈ మట్టం ఉండటం లేదు. తుపాకులగూడెం బ్యారేజి నిర్మాణం పూర్తయితే పంపుల నిర్వహణకు ఎలాంటి సమస్య ఉండదు. దేవాదుల పంపుహౌస్‌కు మూడు కిలోమీటర్ల దిగువన తుపాకులగూడెం బ్యారేజి నిర్మాణం జరుగుతుంది. ఈ పనులకు ఆటంకం కలగకుండా కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టారు. దీంతోపాటు పునాదులకు సంబంధించిన పనులు కూడా చేపట్టడంతో దేవాదుల వద్ద మట్టం పెరిగింది. గోదావరి, ఇంద్రావతి ద్వారా వచ్చే నీటితో రోజూ నాలుగు నుంచి ఐదువేల క్యూసెక్కుల వరకు ప్రవాహం ఉంటుంది. నీటిమట్టం 71.5 అడుగులకు చేరిన వెంటనే నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుంది. సంబంధిత ఇంజినీర్లు, అధికారులతో మంత్రి హరీశ్‌రావు చర్చించి రబీకి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. రోజూ 600 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదలకు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం తుపాకులగూడెం నిర్మాణం పూర్తయితే దేవాదుల కింద రెండు పంటలకు నీరందించడానికి వీలవుతుంది.