హైదరాబాద్‌లో ఎగిరే పాము

0flying-snake-found-in-hyderనగరంలో ఇంతకుముందు ఎన్నడూ కనిపించని ఎగిరే పాము బుధవారం ఘోషామహల్‌ ప్రాంతంలో కనిపించింది. ఈ పామును ఒర్నేట్‌ ఫ్లయింగ్‌ స్నేక్‌ లేదా క్రైసోపెలి ఒర్నట అని పిలుస్తారు. విషపూరితమైన ఈ పాము ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కనిపించలేదు.

షట్టర్‌ కింద దాక్కున్న ఈ పామును ఫ్రెండ్స్‌ అండ్‌ స్నేక్‌ సొసైటీ వాళ్లు పట్టుకుని సైనిక్‌పూరిలోని సంరక్షిత కేంద్రానికి తరలించారు. పశ్చిమ కనుమలు, బీహార్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ఈశాన్యరాష్ట్రాలు, కొన్ని ఆసియా దేశాల్లో ఈ పాములు సాధారణంగా కనిపిస్తుంటాయి.

ఎగిరేపామును పట్టుకున్న ఫ్రెండ్స్‌ అండ్ స్నేక్‌ సొసైటీ సంయుక్త కార్యదర్శి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఘోషామహల్‌లోని ఓ దుకాణ యజమాని తమ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసినట్లు చెప్పారు. తన ప్లైవుడ్‌ షాపు ఎంట్రన్స్‌లో ఓ చిన్నపామును చూశానని సాయం చేయాలని కోరినట్లు తెలిపారు.

దీంతో కొందరు టీం మెంబర్స్‌ వెంటనే అక్కడకు చేరుకున్నారని వివరించారు. తాము మొదట అది రాట్‌ స్నేక్‌ లేదా కోబ్రా అవ్వొచ్చని భావించామని చెప్పారు. కానీ, తమ అంచనాలను పటాపంచలు చేస్తూ ఫ్లయింగ్‌ స్నేక్‌ కనిపించిందని వెల్లడించారు. జాగ్రత్తగా దాన్ని పట్టుకుని సైనిక్‌పురిలోని తమ కార్యాలయానికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత పామును సంరక్షిత కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు.