92 ఏళ్ల వయసులో అమెరికా మాజీ అధ్యక్షుడి శ్రమదానం

0


former-president-Jimmy-Carterజిమ్మీ కార్టర్‌.. అమెరికా మాజీ అధ్యక్షుడు.. వయసు 92 ఏళ్లు! నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత. మెలనోమా (చర్మ కేన్సర్‌)తో పోరాడి గెలిచిన ధీరుడు. అలాంటి వ్యక్తి ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకున్నా అడిగేవారెవరూ లేరు. కానీ.. ఆయన మాత్రం అలా అనుకోలేదు. కెనడాలోని విన్నీపెగ్‌లో నిరుపేద నిరాశ్రయులకు గూడు కల్పించే ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో శ్రమదానం చేశారు! అలా కష్టపడుతూనే ఒంట్లోని నీరంతా ఆవిరైపోయి (డీహైడ్రేషన్‌) నిస్సత్తువతో కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్తే.. ఒకరోజు చికిత్స పొంది మళ్లీ వెళ్లి శ్రమదానం చేశారు. ఆయన భార్య రోజ్లిన్‌ (89) కూడా.. భర్తకు తగ్గ ఇల్లాలే!! శ్రమ అనుకోకుండా ఆమె కూడా ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2015లో కేన్సర్‌ బారిన పడినప్పుడు కూడా.. చికిత్స పొందుతూనే అమెరికాలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న ఘన చరిత కార్టర్‌ది. మండే ఎండలో.. తొమ్మిది పదుల వయసులో కార్టర్‌ ఇంత కష్టపడుతున్న సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ న్యూజెర్సీలోని తన సొంత గోల్ఫ్‌క్లబ్‌లో జరుగుతున్న మహిళల గోల్ఫ్‌ పోటీలను 8 గంటలపాటు ‘కష్టపడి’ వీక్షించారు!! అంతే కాదు.. ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జూలై 14కు 176 రోజులైతే, అందులో 36 రోజులు.. అంటే 20 % సమయం గోల్ఫ్‌ క్లబ్‌లోనే గడిపారు. ట్రంప్‌ సంగతి పక్కన పెడితే మన నాయకుల్లో ఎవరైనా.. ఆ వయసులో అలా పలుగో, పారో, సుత్తో, స్ర్కూడ్రైవరో చేతపట్టి అలా పని చేయగలరా?