మంటలు కక్కే గబ్బిలాన్ని చూశారా?

0పాశ్చాత్య దేశాల్లో పురాణ కథల్ని ఎంచుకుని వాటిని భారీ విజువల్ గ్రాఫిక్స్‌తో బుల్లితెర సిరీస్ – వెబ్ సిరీస్‌లుగా రూపొందించి బిలియన్ డాలర్ బిజినెస్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటికి ఆదరణ దక్కుతుండడంతో వెబ్ సిరీస్ పరిశ్రమ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఏ స్థాయిలో అంటే ప్రఖ్యాత అమెజాన్ నెట్ ఫ్లిక్స్ హాట్ స్టార్ ఈరోస్ లాంటి సంస్థలు వెబ్ సిరీస్‌లకే వందల కోట్లు ధారపోస్తుండడం చూస్తుంటే ఈ రంగంలో ఆదాయం ఏ రేంజులో ఉందో అంచనా వేయొచ్చు.

అమెరికన్ టీవీ చానెల్ హెచ్‌బీవో ఈ తరహా టీవీ సిరీస్‌లు తెరకెక్కించి వాటిని లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ల ద్వారాను భారీగానే క్యాష్ చేసుకుంటోంది. గేమ్స్ ఆఫ్ థ్రోన్ లాంటి భారీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌కి బుల్లితెర యూట్యూబ్‌లో ఆదరణ అద్భుతంగా ఉంది. అందుకే ఈ సిరీస్‌ని ఎంతోకాలంగా అలా సాగదీస్తూనే ఉన్నారు. ఇక ఈ సిరీస్ ముగింపునకు వచ్చిందని తెలుస్తోంది. ఆ మేరకు తాజాగా రిలీజ్ చేసిన 1నిమిషం 40 సెకన్ల టీజర్ మెరుపులు మెరిపించింది. ఇందులో ఓ భీకరమైన గబ్బిలం సైన్యంపైకి మంటలు ఊదేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తోంది. గరుడపురాణంలో గరుత్మంతుడి విన్యాసాల్లా.. రామాయణంలో ఆంజనేయుడి లంకా దహన విన్యాసాల్లా.. ఈ గబ్బిలం విన్యాసం ఆకట్టుకుంటోంది. గబ్బిల ఆకారంలో ఉన్న ఈ క్రూరమైన పక్షి పేరు డ్రాగన్ గా పిలుస్తున్నారు. నటి సోఫీ టర్నర్ ఈ పాత్ర గురించి వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తోంది.

`గేమ్స్ ఆఫ్ థ్రోన్స్` సిరీస్ స్ఫూర్తితో గరుత్మంతుడి పురాణం వీరాంజనేయుడి యుద్ధం వంటివాటిని బుల్లితెరకెక్కిస్తే దానికి ఇండియాలో ఆదరణ అద్భుతంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే అలాంటి ప్రయత్నం చేస్తే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కానీ పరుచూరి సోదరులు అంతటి వారు కానీ బరిలో దిగి అమెజాన్ నెట్‌ఫ్లిక్స్‌లకు కథలు అందించాల్సి ఉంటుందేమో?