‘గీత గోవిందం’ రీమేక్..?

0టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’ మూడు వారాల తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తోంది. గత రెండు వారాల్లో వచ్చిన కొత్త సినిమాలేవీ కూడా దాని ముందు నిలవలేకపోయాయి. ఇప్పటికే రూ.60 కోట్ల షేర్ మార్కును దాటేసి కొత్త శిఖరాల వైపు అడుగులేస్తోందీ చిత్రం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. వేరే ప్రాంతాల్లో కూడా ‘గీత గోవిందం’ జోరు కొనసాగుతోంది. అమెరికాలో మంచి టాక్ తెచ్చుకున్న తెలుగు సినిమాలు మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం మామూలే కానీ.. తమిళనాట సైతం ఈ చిత్రం ప్రభంజనం సృష్టించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తమిళనాట ‘అర్జున్ రెడ్డి’తో వచ్చిన విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్ ఈ చిత్రానికి బాగా ఉపయోగపడింది.

అక్కడ రూ.5 కోట్లకు పైగా గ్రాస్.. రూ.2 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నాన్-బాహుబలి రికార్డు నెలకొల్పింది ‘గీత గోవిందం’. ఐతే తమిళనాట ఇంత బాగా ఆడాక కూడా ఈ చిత్రాన్ని అక్కడ రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతుండటం విశేషం. రూ.2 కోట్ల ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడట ఒక నిర్మాత. తమిళనాట చెన్నై మాత్రమే కాక పలు నగరాల్లో… పట్టణాల్లో ‘గీత గోవిందం’ చాలా బాగా ఆడింది. లక్షల మంది ఈ సినిమా చూశారు. మరి ఇలాంటి సినిమాను రీమేక్ చేయాలనుకోవడం సరైన నిర్ణయమేనా అన్నది డౌటు. ‘అర్జున్ రెడ్డి’ విషయానికొస్తే ముందే రీమేక్ ఖరారైపోవడంతో బాగా ఆడుతున్న సినిమాను థియేటర్ల నుంచి తీయించేశారు. పైగా అదో భిన్నమైన సినిమా. కానీ ‘గీత గోవిందం’ మామూలు కథే. విజయ్ మేనియా దీనికి బాగా కలిసొచ్చి బాగా ఆడింది. ఇలాంటి సినిమాను రీమేక్ చేసి ఏం సాధిస్తారో చూడాలి.