ఏపీలో చారిత్రక ఘట్టం…కృష్ణానదికి గోదావరి నీరు

0విజయవాడ, సెప్టెంబర్ 9 : ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి జాలాలు కృష్ణా జిల్లాలో ప్రవేశించాయి.క‌ృష్ణా జిల్లాలో పల్లర్లమూడి వద్ద ప్రత్యేక పూజల అనంతరం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గోదావరి జలాలకు స్వాగతం పలికారు. ఈ ఘట్టాన్ని రైతుల ఆనందంగా జరుపుకున్నారు. భారీగా తరలివచ్చిన అన్నదాతలు, ప్రజలు గోదారమ్మ పసుపు, కుంకాలు సమర్పించి బాణాసంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు. గోదావరి నీరు ప్రవేశిస్తున్న సమయంలో ఆనందంతో కేరింతలు కొట్టారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల, కృషికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా కొనియాడారు. చరిత్రలో ఇదో అద్భుత ఘట్టమన్నారు. సెప్టెంబర్ 15న గోదావరి జలాలను చంద్రబాబు చేతుల మీదుగా కృష్ణతో అనుసంధానం చేస్తామని మంత్రి అన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న కల నెరవేరిందంటే అంతా చంద్రబాబు అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. నదుల అనుసంధానంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు ఇకనైనా కళ్లు తెరవాలన్నారు. ఎన్నో ఏళ్ల కల సాకారం చేసిన చంద్రబాబు కృష్ణా జిల్లా ప్రజల మనసుల్లో మరో కాటం దొరగా నిలిచిపోతారని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు.

గోదావరి నీరు పల్లెర్లమూడికి ప్రవేశించగానే రైతులు సంబరాలు చేసుకున్నారు. గోదారమ్మకు పసుపు, కుంకుమ, పూలు జల్లి పూజలు చేశారు. బాణాసంచా కాల్చి డప్పు వాయిద్యాలతో చిన్నా, పెద్ద సంబరాల్లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాకు ప్రవేశించిన గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. పల్లర్లమూడి వద్ద ప్రవేశించిన జలాలు పక్కనే ఉన్న సీతారాంపురానికి చేరుకున్నాయి.