చిన్న సినిమాలకు పెద్ద కాలం!

0ఏ బాష అయినా స్టార్ హీరో సినిమాలు వస్తున్నప్పుడు చిన్నవి ప్లస్ మీడియం బడ్జెట్ వి పక్కకు తప్పుకోవడం సహజం. జనం భారీ వాటి వైపే మొగ్గు చూపుతారు కాబట్టి వసూళ్లపరంగా కూడా ఇబ్బంది తలెత్తుతుందేమోనన్న ఉద్దేశంతో వేరే డేట్స్ ని వాడుకుంటారు. టాలీవుడ్ లో పరిస్థితిని చూస్తే చిన్న సినిమాలకు మంచి సీజన్ వచ్చినట్టు కనిపిస్తోంది. కారణం పెద్ద హీరోలవన్నీ దాదాపు ఈ ఏడాది మొదటి సగంలోనే వచ్చేసాయి కాబట్టి. బాలకృష్ణ-మహేష్ బాబు-రామ్ చరణ్-పవన్ కళ్యాణ్ ఇలా వారి కోటాలో రావాల్సిన సినిమాను ఇప్పటికే ఇచ్చేసారు కాబట్టి మరో ఛాన్స్ లేనట్టే. ఇక 2018లో స్టార్ క్యాటగిరీలో రావాల్సిన సినిమాలు రెండే కనిపిస్తున్నాయి. ఒకటి నాగార్జున నానిల మల్టీ స్టారర్ దేవదాస్ కాగా మరొకటి జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ. దేవదాస్ డేట్ సెప్టెంబర్ 27 లాక్ అయిపోగా యంగ్ టైగర్ సినిమా కూడా అక్టోబర్ 11న రావడం దాదాపు ఖాయమే. అంటే కేవలం రెండు వారాల గ్యాప్ లో ఇవి తలపడనున్నాయి. దీంతో ఈ ఇద్దరి తరఫున బాలన్స్ ఉన్న టాస్క్ పూర్తయినట్టే. ఇక వీటికి ముందు తర్వాత ఉన్నవన్నీ మీడియం రేంజ్ తో పాటు ఉన్న చిన్న సినిమాలు మాత్రమే.

సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ అవకాశాన్ని చిన్న సినిమాలు బాగా వాడుకోవచ్చు. తేదీలను క్లాష్ కాకుండా చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి థియేటర్స్ దక్కడంతో పాటు పబ్లిక్ లోకి సినిమాను బాగా ప్రమోట్ చేసే అవకాశం దక్కుతుంది. దానికి ఉదాహరణగా సెప్టెంబర్ 7ని చెప్పుకోవచ్చు. మొత్తం ఏడు స్ట్రెయిట్ సినిమాలు రాబోతున్నాయి. మరీ ఇలా ఒకేసారి దాడి చేస్తే కష్టం కానీ కాస్త సర్దుకునే తరహాలో ముందుకు వెళ్తే కంటెంట్ ఉన్న సినిమాలు నిలబడిపోవడమే కాదు మంచి వసూళ్లు కూడా రాబడతాయి. దేవదాస్ అరవింద సమేత వీర రాఘవ డేట్లను మినహాయిస్తే చేతిలో ఇంకా మూడు నెలలకు పైగా టైం ఉంటుంది. సో ఇది మంచి కాలమని ట్రేడ్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే సుధీర్ బాబు చాలా తెలివిగా 13 నుంచి తన కొత్త సినిమా నన్ను దోచుకుందువటే డేట్ ని 21కి మార్చేసుకున్నాడు. ఆ రోజు ఏమంత పోటీ లేదు. మరి చిన్న సినిమాలు దీనిని ఎలా ఉపయోగించుకుంటాయి అనేదే ఇక్కడ కీలకం. థియేటర్ల ఫీడింగ్ తో పాటు ఆడియన్స్ కి మంచి ఛాయస్ గా నిలిచే ఏ సినిమా అయినా విజయం సాదిస్తుందని చలో ఆరెక్స్ 100 లాంటివి ఋజువు చేశాయి. అందుకే సంక్రాంతి వచ్చే లోపు ఈ మూడు నెలల కాలం వాడుకున్న వాళ్లకు వాడుకున్నంత ఉపయోగం ఇచ్చేలా ఉంది.