ఆగస్టు 3న స్నేహితుల సమరం

0కొన్నిసార్లు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు సైతం బాక్సాఫీస్ దగ్గర తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉన్న వాళ్లు కూడా అప్పుడప్పుడూ బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారుతుంటారు. ఆగస్టు 3న కూడా అదే జరగబోతోంది. వచ్చే శుక్రవారం రిలీజ్ కాబోయే ‘గూఢచారి’.. ‘చి ల సౌ’ యూనిట్లలో కీలకమైన వ్యక్తులు క్లోజ్ ఫ్రెండ్స్. ‘గూఢచారి’ హీరో అడివి శేష్ కు.. ‘చి ల సౌ’ టీంలోని ముఖ్యులందరితో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా ‘చి ల సౌ’తో దర్శకుడిగా పరిచయం కానున్న రాహుల్ రవీంద్రన్ అతను మంచి ఫ్రెండ్. వీళ్లిద్దరూ పరస్పరం అవతలి వాళ్ల సినిమాల గురించి ముందు నుంచి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఒకరికొకరు కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటున్నారు.

ఈ సినిమాలు రెండూ ఒకే రోజు విడుదల కాబోతున్న విషయం ఖరారయ్యాక ఇద్దరూ కలవడం.. ఒక ఫొటో కూడా షేర్ చేయడం విశేషం. ఇక ‘చి ల సౌ’లో కీలక పాత్ర పోషించిన వెన్నెల కిషోర్ కు శేష్ ఎంత క్లోజో అందరికీ తెలిసిందే. ఆ చిత్ర కథానాయకుడు సుశాంత్ తోనూ శేష్ కు అనుబంధం ఉంది. మరోవైపు ‘గూఢచారి’లో కీలక పాత్ర పోషించిన సుప్రియ.. సుశాంత్ కు సోదరి అన్న సంగతి తెలిసిందే. ఇలా రెండు చిత్రాల యూనిట్ సభ్యులకూ కనెక్షన్ చాలానే ఉంది. దీంతో ఈ రెండు సినిమాలూ బాగా ఆడాలని వీటి చిత్రాల యూనిట్ సభ్యులు బలంగా కోరుకుంటున్నారు. ఒకరికొకరు పోటీగా భావించట్లేదు. విశేషం ఏంటంటే.. ఈ రెండు చిత్రాల ప్రోమోలూ ఆకట్టుకున్నాయి. వీటికి పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ రెండింట్లోనూ హిట్టు కళ కనిపిస్తోంది. మరి ఈ రెండూ హిట్టయి ఇరు వర్గాలకూ ఆనందాన్ని పంచుతాయేమో చూద్దాం.