ఆ మ్యూజిక్ డైరెక్టర్ హీరో అయ్యాడు

0తెలుగులో రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశాడు గోపీసుందర్. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’.. ‘మజ్ను’.. ‘ఊపిరి’.. ‘నిన్ను కోరి’ లాంటి సినిమాలు అతడికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. మధ్యలో కొన్ని సినిమాలు తేడా కొట్టినా ప్రస్తుతం టాలీవుడ్లో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో గోపీసుందర్ ఒకడు. ఈ మలయాళీ హీరో అవతారం ఎత్తడం విశేషం. అతను హీరోగా ‘టోల్ గేట్’ అనే సినిమా మలయాళంలో మొదలైంది. ఒక నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. హరికృష్ణన్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందవించబోతున్నాడు. హజీనా సలామ్ నిర్మాత.

ప్రారంభోత్సవం రోజే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో చాలా ఆసక్తికరంగా ఉందా పోస్టర్. గోపీసుందర్ అని చెబితే తప్ప గుర్తు పట్టలేనట్లుగా లుక్ మార్చేశాడతను. ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించే అతను గడ్డం పెంచాడు. ఈ సినిమా కోసమేనేమో.. ఈ మధ్య గోపీ చాలా బరువు కూడా తగ్గాడు. ఒకప్పుడు అతను లావుగా ఉండేవాడు.

తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ ఇప్పటికే హీరోగా చాలా బిజీగా ఉన్నాడు. అతను రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నాడు. మరో మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ సైతం హీరోగా మారి వరుసగా సినిమాలు చేసుకుపోతున్నాడు. మన దేవిశ్రీ ప్రసాద్ కూడా హీరో అవుతాడని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఈలోపు గోపీసుందర్ హీరో అవతారం ఎత్తేశాడు. మరి అతను ఏమేరకు విజయవంతమవుతాడో చూడాలి.