పరిటాల కోసం ఆ పాట రాశా !

0`పల్లె కన్నీరు బెడుతుందో….కనిపించని కుట్రల….`అంటూ పల్లెవాసులు పట్నం బాట పడుతున్న వైనాన్ని – చేతివృత్తులు అంతరించిపోతున్న విషయాన్ని ఎలుగెత్తి చాటారు….`ననుగన్న నా తల్లి రాయల సీమ రతనాల సీమ` అంటూ…..రాయలసీమ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. కవిగా….గాయకుడిగా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న జానపద కళాకారుడు గోరటి వెంకన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. జానసద గేయాలతో పాటు కొన్ని సినిమాలకు కూడా గోరటి వెంకన్న పాటలు రచించారు. తాజాగా ఓ తెలుగు చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకన్న….ఆ షో వ్యాఖ్యాత అలీతో అనేక విషయాలు పంచుకున్నారు. పల్లె కన్నీరు…పాట వెనుక కొన్ని వందల జీవితాలు ఉన్నాయని అన్నారు. దివంగత నేత పరిటాల రవి పట్టుబట్టి మరీ `శ్రీరాములయ్య`సినిమాలో `నను గన్న` పాట తనతో రాయించారని వెంకన్న అన్నారు.

వాస్తవానికి తమది దక్షిణ తెలంగాణ అని – కృష్ణానదికి ఓ 20 కిలోమీటర్ల ఇవతల తమ ఊరు ఉండడంతో రాయల సీమతో అనుబంధం ఎక్కువని వెంకన్న అన్నారు. సీమ ప్రాంతాలలో ఎక్కువ తిరిగిన అనుభవం ఉందని – అక్కడి గ్రామాల్లో పరిస్థితులపై అవగాహన ఉందని అన్నారు. పరిటాల రవి గారితో తనకు పరిచయం ఉందని – తనంటే ఆయనకి ప్రేమని – ఆయనంటే తనకు గౌరవమని వెంకన్న అన్నారు. ఈ నేపథ్యంలో ‘శ్రీరాములయ్య’ సినిమా కోసం రాయలసీమ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఓ పాట రాయాలని…. రాయకపోతే బాగుండదని పరిటాల రవి పట్టుబట్టారని చెప్పారు. అలా `ననుగన్న నా తల్లి రాయల సీమ రతనాల సీమ`పాట రాశానని చెప్పారు. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా తనకు హైదరాబాద్ బదిలీ అయిందని అయితే నగర జీవితానికి కాస్త దూరంగా వుండే తత్వం కాబట్టి పల్లె జీవితంపై ఆసక్తి అలాగే ఉందని అన్నారు. అందువల్ల వలసల కారణంగా గ్రామాలలో పరిస్థితులు మారిపోయి చేతివృత్తులు అంతరించుపోయే పరిస్థితులు వచ్చాయని…. అదే ఆ పాట రాయడానికి కారణమైందని చెప్పారు. ఆ పాటలోని ప్రతి మాటలో నిజంగా కొన్ని జీవితాలున్నాయని …తమ ఊరు .. అక్కడి పరిస్థితులు ….తమ ఊళ్లోని మనుషులు కనిపిస్తాని వెంకన్న అన్నారు.