ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం పథకానికి ఇదో ఘనత

0kaleswaram-project-pumpప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం పథకానికి ఇదో ఘనత.. దేశంలోనే అతి పెద్ద మోటారు పంపును ఈ పథకానికి అమర్చారు.. ఆ మాటకొస్తే దేశంలోనే ఎత్తిపోతల పథకంలో ఇంత పెద్ద మోటారు పంపు మరెక్కడా లేవని.. ఒకేచోట ఇంత ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపుల్లో ప్రపంచంలోనే ఇదొకటనేది నీటిపారుదల శాఖ వర్గాల సమాచారం. దీని సామర్థ్యం 139 మెగావాట్లు. ఈ పథకంలో అమర్చుతున్న మొత్తం ఏడు పంపుల్లో ఇదే మొదటిది. దీనిని అమర్చే ప్రక్రియ పూర్తయింది.

180 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి మళ్లించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొత్తం 82 పంపులు, మోటార్లు అమర్చుతారు. ఇందులో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని మళ్లించే ఎనిమిదో ప్యాకేజి పని అన్నింటికన్నా వేగంగా జరుగుతోంది. ఇక్కడ ఒక్కోటి 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే ఏడు మోటారు పంపులను ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ లిప్టు వద్దనే 973 మెగావాట్ల సామర్థ్యంతో పంపులు అమర్చుతున్నారు. 3147.95 క్యూసెక్కుల నీటిని 115 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తుంది. మొత్తం ఏడు పంపులు కలిసి 22,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తాయి. ఇప్పటికే వినియోగంలో ఉన్న పథకాలను పరిశీలిస్తే ప్రస్తుతం కాళేశ్వరంలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో పంపు ఒక్కో ప్రాజెక్టుతో సమానమని చెప్పాలి.

ఫిబ్రవరినాటికి రెండో పంపు

ఈ ప్రాజెక్టులో మొదటి పంపు, మోటారు అమర్చే ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు, పరీక్షించి కూడా చూశారు. ఈ సమయంలో వచ్చిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకొని వారం, పదిరోజుల్లో అధికారికంగా డ్రైరన్‌ నిర్వహిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకేసారి పూర్తి స్థాయిలో నిర్వహిస్తే ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికే రెండు నుంచి నాలుగు వారాలు పడుతుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అన్ని పనులు జాగ్రత్తగా చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఫిబ్రవరి నాటికి రెండో పంపు ఏర్పాటు పూర్తవుతుందని, జూన్‌ నాటికి అన్ని పంపులు సిద్ధమవుతాయని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. పంపులు, మోటార్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్తు సరఫరా ఏర్పాట్లను ట్రాన్స్‌కో వేగంగా చేస్తోంది. ఎనిమిదో ప్యాకేజీలో పంపులను అమర్చినా, ఎల్లంపల్లి నుంచి నీటిని మళ్లించే ఆరో ప్యాకేజీ పనులు పూర్తయితేనే నీటిని మళ్లించి పంపులను ప్రయోగాత్మకంగా నిర్వహించి నీటిని విడుదల చేయడం వీలవుతుంది. ఈ పనిలో కొంత జాప్యం ఉన్నట్లు తెలిసింది. శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రంలో నీటి నుంచి విద్యుదుత్పత్తికి ఎడమవైపు ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం గల పవర్‌ జనరేటర్‌ కాగా, కుడివైపు ఒక్కొక్కటి 110 మెగావాట్లు. సాగునీటి ప్రాజెక్టుల్లో మాత్రం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిందే అత్యధిక సామర్థ్యం కలిగింది. పాలమూరు-రంగారెడ్డిలో ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం గల పంపు, మోటారు అమర్చేలా డిజైన్‌ చేసి గుత్తేదారులతో ఒప్పందం చేసుకున్నారు.