అద్భుతం: బాహుబలి చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ

0ఇటీవల ఓ పదేళ్ళ పాపకు మెదడులో కణితి ఉండటంతో ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేస్తే ప్రమాదం అని భావించి ఆమెకు ఇష్టమైన కాండీక్రష్ గేమ్ ఆడుకోమని చెప్పి ఆపరేషన్ పూర్తి చేశారు డాక్టర్లు. ఇంతకు ముందు కూడా ఓ పేషెంట్‌ గిటార్ ప్లే చేస్తుంటే డాక్టర్లు బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. తాజాగా ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన మరొకటి గుంటూరులో చోటుచేసుకుంది. ఇక్కడ ఓ మహిళకు బ్రెయిన్ ఆపరేషన్ చేస్తూ ఆమెకు ఇష్టమైన బాహుబలి సినిమాని ప్రదర్శించి మత్తు ఇవ్వకుండా ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు గుంటూరు డాక్టర్లు.

వివరాల్లోకెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన విజయకుమారి అనే ఓ స్టాఫ్ నర్సు సడెన్‌గా ఫిట్స్ వచ్చి పడిపోయింది. ఆమెను గుంటూరులోని తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌కు తరలించగా ఆమెను పరిశీలించిన డాక్టర్లు ఆమె మెదడులో రక్తం గడ్డకట్టిందని శస్త్ర చికిత్స ద్వారా ఆ గడ్డను తొలగించాలని నిర్ణయించారు. అయితే ఆమె ఆపరేషన్ జరిగినంతసేపు సహకరించాల్సి ఉంటుందని చేతులు వేళ్లు కదిలించాలని అందువల్ల మత్తు మందు ఇవ్వడం కుదరదని తెలిపారు. దీంతో ఆమెకు ఆపరేషన్ అంటే భయం పోగట్టడానికి తనకు ఇష్టమైన ‘బాహుబలి 2 ’ మూవీని ఆపరేషన్ థియేటర్‌లో ప్రదర్శించారు.

ఆమె ఎంచక్కా బాహుబలి సినిమా చూస్తూ ఆ సినిమాలోని ‘దండాలయ్యా.. దండాలయ్యా’ పాటను పాడుతూ డాక్టర్‌లకు సహకరించడం విశేషం. తనకు సినిమా సరిగా కనిపించడం లేదని డిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల తనకు స్క్రీన్ సరిగా కనిపించడంలేదని దగ్గరకు పెట్టాలని కోరింది. అంతేకాకుండా ఇదేమి సినిమా అంటూ డాక్టర్‌లు ప్రశ్నించగా బాహుబలి 2 అంటూ హుషారుగా సమాధానం చెప్పింది. సుమారు గంటన్నర సేపు శ్రమపడిన డాక్టర్స్ విజయకుమారి మెదడులో ఉన్న గడ్డను విజయవంతంగా తొలిగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని మీడియాకు తెలుపుతూ ఆపరేషన్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.