పెద్ద కొడుకు స్కై.. చిన్న కొడుకు స్టార్

0సోషల్ మీడియా జోరు పెరిగాక జనాల్లో సెన్సిటివిటీ మరీ పెరిగిపోయింది. ప్రతి చిన్న విషయాన్నీ వివాదంగా మార్చేస్తున్నారు. మతం.. కులం పేరుతో పేరుతో సామాజిక మాధ్యమాల్లో గొడవలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చదవేస్తే ఉన్న మతి పోయిందనే సామెత చందాన విద్యావంతులే మతాలు.. కులాల పేరుతో గొడవలు పడుతున్న వైనాల్ని చూస్తున్నాం. ఇలాంటి సమయంలో కొందరు ప్రముఖులు ఈ నిప్పును మరింత రాజేస్తూ ఉంటారు. అదే సమయంలో కొందరు జనాలకు మంచి సందేశాలిచ్చే పనులు చేస్తుంటారు. ప్రముఖ బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ రెండో కోవకే చెందుతాడు.

‘హకీమ్స్ ఆలిమ్’ పేరుతో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద సెలూన్ చైన్ నడుపుతుండటమే కాక.. బాలీవుడ్లో ఎందరో టాప్ సెలబ్రెటీలకు స్టైలిస్టుగా పని చేస్తున్న హకీమ్.. తాజాగా రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య జస్బీర్ సింగ్ రెండో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆ విషయాన్ని ప్రకటిస్తూ తన కొడుక్కి చిత్రమైన పేరు పెట్టినట్లు ప్రకటించాడు హకీమ్. కొడుక్కి ‘స్టార్’ అని పేరు పెట్టుకున్న హకీమ్.. అతడి మతం ‘హ్యుమానిటీ’ (మానవత్వం) అని పేర్కొన్నాడు. సిక్కు అమ్మాయిని పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉంటున్న హకీమ్.. అనవసర మత వివాదాలు రాజేసేవాళ్లకు ఇలా కౌంటర్ ఇచ్చాడు. ఇంతకుముందు పుట్టిన బిడ్డకు హకీమ్ ‘స్కై’ (ఆకాశం) అని పేరు పెట్టుకోవడం విశేషం.