ఎమోషనల్ లవ్-ఫ్యామిలీ సెంటిమెంట్

0ఒక మనసు సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన మెగా వారసురాలు నిహారిక తాజాగా నటించిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు. లక్ష్మన్ కర్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రమోద్ వంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ హీరోయిన్ గా హిట్ కొట్టిన నిహారిక తెలుగులో నటించిన తాజా సినిమాపై బోలెడు అంచనాలున్నాయి.

ఇటీవలే నిహారిక ఈ సినిమా ప్రమోషన్ ను కొత్తగా మొదలుపెట్టింది. తన పెళ్లి గురించి ప్రశ్నించిన యూట్యూబర్ ను తిడుతున్నట్టు విడుదల చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ‘హ్యాపీ వెడ్డింగ్ ’ ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ మేరకు ట్రైలర్ లో వీరి సంగీతం ఆకట్టుకుంది.

ట్రైలర్ ను విశ్లేషిస్తే.. ఆధునిక భావాలు కలిగి పెద్దింట్లో పెరిగిన అమ్మాయి.. ఓ సంప్రదాయ కుటుంబంలోకి పెళ్లి చేసుకొని వస్తే ఎలా ఉంటుందనేది కథ అని అర్థమవుతోంది. జాలీగా తిరిగే అమ్మాయి పాత్రలో నిహారిక ఒదిగిపోగా.. సంప్రదాయ యువకుడిగా సుమంత్ అశ్విన్ నటించారు. నిహారిక తో సుమంత్ పెళ్లి నిశ్చయమవడం.. వీరిద్దరికి మధ్య విభేధాలు సంప్రదాయ కట్టుబాట్లు తదితరాలు ట్రైలర్ లో చూపించారు. ఫుల్ లెంత్ లవ్ ఫ్యామిలీ డ్రామాలాగా ఈ ట్రైలర్ కనిపించింది. నిహారిక సుమంత్ నటన అద్భుతంగా కనిపించింది. ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరో మంచి లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.