అవన్నీ ఊసుపోని స్కిట్సేనా?

0

దర్శకరత్న డా.దాసరి నారాయణరావు జయంతిని డైరెక్టర్స్ డే గా జరుపుకుంటూ టాలీవుడ్ లో కొత్త కల్చర్ కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మే 4న డైరెక్టర్స్ డే సంబరాల్లో మెగాస్టార్ చిరంజీవి.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వంటి ప్రముఖుల సమక్షంలో దర్శక సంఘం అద్భుతమైన ఈవెంట్ ని ప్లాన్ చేసింది. అయితే ఈ వేడుకలో ఎవరూ ఊహించని విధంగా దర్శకులంతా స్కిట్ లతో అలరించే ప్రయత్నం చేశారు. స్కిట్ల ఆలోచన ఓకే కానీ ఆశించిన స్థాయిలో ఏ స్కిట్ పేలకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది.

ఈ వేడుకల్లో మెజారిటీ భాగం దర్శకులు పాల్గొన్నా సీనియర్ దర్శకులు బిజీ షెడ్యూల్స్ వల్ల రాలేకపోయారని తెలిసింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దర్శకులే వేదికలెక్కి స్కిట్లు చేస్తూ అహూతుల్ని రంజింపజేసేందుకు ప్లాన్ చేయడంపై చిన్నపాటి విమర్శలు తప్పలేదు. రేలంగి నరసింహారావు.. హరీష్ శంకర్ .. అనీల్ రావిపూడి లాంటి దర్శకులు స్పాంటేనియస్ గా కొన్ని స్కిట్ లు చేసి మెప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఎందుకో అవి సరిగా కుదరకపోవడంతో డీగ్రేడ్ స్కిట్స్ అంటూ విమర్శలొచ్చాయి. చిరు.. కె.రాఘవేంద్రరావు అంతటి పెద్దల ముందు ఇలాంటి నాశిరకం స్కిట్స్ చేస్తారా? అంటూ క్రిటిసిజం కనిపించింది. ఇక అనీల్ రావిపూడి స్వయంగా ఓ స్కిట్ రాసుకుని హరీష్ శంకర్ తో కలిసి చేశాడు. ఆ స్కిట్ పై మిక్స్ డ్ టాక్ వినిపించింది. ఆ స్కిట్ పేలవంగా ఉందని కొందరంటే.. మరికొందరు అద్భుతంగా నవ్వించిందని అన్నారు. ఓవరాల్ గా ఇదంతా జస్ట్ ఫన్ కోసమేనని దర్శకులు చెబుతున్నారు. అనీల్ రావిపూడి అప్పటికప్పుడే రాసుకున్న స్కిట్ అదని తెలిసింది. అయితే పెద్ద వాళ్లను పిలిచేప్పుడు మరికాస్త జాగ్రత్తగా ఉండాల్సిందన్న విమర్శలు వినిపించాయి.

ఈ సెలబ్రేషన్స్ లో మరో హైలైట్ ఏమిటంటే .. ఇకమీదట దర్శకుల సంఘం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్ని తలపెట్టనున్నారని తెలుస్తోంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇందుకోసం పిలుపునివ్వగా అందరూ స్పందించి విరాళాల్ని ప్రకటించారు. మెగాస్టార్ ఒక్కరే 25లక్షల విరాళం ప్రకటించగా మిగతా వాళ్లు ప్రకటించిన మొత్తాన్ని కలిపితే కోటి విరాళం ఓవర్ నైట్ లో ప్రకటించేయడం ఆసక్తి రేకెత్తించింది. దాదాపు 88ఏళ్ల చరిత్ర ఉన్న టాలీవుడ్ లో మన దర్శకసంఘం అతి పెద్ద సంఘం. అయితే ఈ సంఘానికి సౌకర్యవంతమైన భవంతిని నిర్మించాల్సిన అవసరం ఉందన్న వాదనా కొందరిలో ఉంది. దర్శకసంఘానికి ప్రస్తుతం ఎన్.శంకర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రామ్ ప్రసాద్ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఇన్ని రోజులు ఇంత శక్తివంతమైన అసోసియేషన్ ఉండీ దాని యాక్టివిటీస్ మాత్రం బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. అందుకే టీఎఫ్డీఏ డాట్ ఇన్ అనే వెబ్ సైట్ ని లాంచ్ చేశారు. ఇందులో సమస్థ వివరాల్ని పొందుపరచనున్నారని తెలుస్తోంది.
Please Read Disclaimer