భర్తపై గృహహింస కేసు పెట్టిన నటి

0mandana-karimi-husband‘బిగ్‌బాస్‌-9’ పోటీదారు, మోడల్‌, నటి మందనా కరిమీ భర్త గౌరవగుప్తాపై గృహహింస కేసు నమోదు చేసింది. వీరు గత జనవరి 25న పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలలు తిరగకముందే వీరి మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. తన జీవనవ్యయానికిగాను భర్త గౌరవ్‌ ప్రతి నెలా రూ. 10 లక్షలు చెల్లించాలని, తనను మానసికంగా వేధించి క్షోభకు గురిచేసినందుకు, తన కెరీర్‌కు, బిజినెస్‌కు నష్టం కలిగించినందుకు రూ. 2 కోట్లు పరిహారం ఇవ్వాలని ఆమె అంధేరి మేజిస్ట్రేట్‌ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లికి ముందు తనను హిందూమతంలోకి మారాల్సిందిగా భర్త గౌరవ్‌ ఒత్తిడి తెచ్చాడని, పెళ్లయిన తర్వాత నటనను వదిలిపెట్టాలని, ఆ వృత్తి సమాజంలో తమ కుటుంబ హోదాకు భంగం కలిగిస్తుందని చెప్పాడని ఇరాన్‌కు చెందిన ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అత్త కూడా తనను వేధించినట్టు ఆమె తెలిపారు.

‘ఏడువారాల కిందట మా అత్తవారి ఇంటి నుంచి నన్ను వెళ్లగొట్టారు. వారితో రాజీ చేసుకునేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. అయినా మా అత్తవాళ్లు నన్ను తిరిగి ఇంట్లోకి రానివ్వలేదు. గౌరవ్‌ కూడా నాతో సంబంధాలు తెంపుకున్నాడు’ అని ఆమె మీడియాకు తెలిపింది. ఈ వ్యవహారాన్ని కోర్టు ఆదేశాల ప్రకారమే తేల్చుకుంటామని ఆమె లాయర్‌ చెప్పారు. ఈ విషయమై స్పందించడానికి గౌరవ్‌ గుప్తా పీఆర్‌ నిరాకరించారు.