కారం అధికంగా తింటే.. బరువు తగ్గుతారా..?

0chilli-may-reduce-overweighచాలా కారంగా ఉండే ఆహారం తినడం అంటే చాలా మందికి ఇష్టమే. కానీ అలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతారు. అయితే నిజానికి వైద్యులే ఏమని అంటున్నారంటే.. కారం మన శరీరానికి మంచిదే, కాకపోతే దాన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. దీంతో అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. గుండె ఆరోగ్యం

కారం ఎక్కువగా తినేవారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కారంలో ఉండే పలు ఔషధ గుణాలు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి.

2. అధిక బరువు

కారం తినడం వల్ల వచ్చే చెమటతో శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. కారం తిన్న తరువాత శరీర మెటబాలిక్ రేటు 8 శాతం వరకు పెరుగుతుందట. దీంతో కొవ్వు కరుగుతుందని అంటున్నారు. కారంగా ఉన్న ఆహారం అయితే చాలా తక్కువగా తింటారు కాబట్టి అలా కూడా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందట.

3. క్యాన్సర్

క్యాన్సర్‌లను అడ్డుకునే శక్తి కారంలోని ఔషధ గుణాలకు ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. క్యాన్సర్ కణాలను నాశనం చేసే పదార్థాలు కారంలో ఉంటాయట. దీంతో వక్షోజాలు, జీర్ణాశయం, గర్భాశయం, ప్రోస్టేట్ వంటి భాగాలకు క్యాన్సర్‌లు రాకుండా ఉంటాయి.

4. ఆయుర్దాయం

చైనాలో 5 ఏళ్ల పాటు కారం ఎక్కువగా తినే 5 లక్షల మందిపై సైంటిస్టులు ప్రయోగాలు చేశారు. దీంతో వారికి తెలిసిందేమిటంటే వారంలో కనీసం 6 సార్లు కారం తిన్నవారికి గుండె జబ్బులు, క్యాన్సర్, ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం 14 శాతం వరకు తగ్గిందట.

5. వాపులు, నొప్పులు

మిరపకాయల్లో అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి. దీనివల్ల ఇవి కీళ్ల నొప్పులు, వాపులను సమర్థవంతంగా తగ్గిస్తాయి. అందుకే చాలా చోట్ల నొప్పులు తగ్గేందుకు కారం ఆహారం తింటారు.

6. శ్వాసకోశ సమస్యలు

శ్వాసకోశ సమస్యల్లో జలుబు ప్రధానమైంది. ఇది వెంటనే తగ్గాలంటే బాగా కారంగా ఉన్న ఆహారం తినాలి. దీంతో ముక్కు నుంచి శ్లేష్మం మొత్తం బయటకు కారిపోతుంది. తద్వారా జలుబు వేగంగా తగ్గుతుంది.

గమనిక: కారం అంటే ఇక్కడ చెప్పింది కేవలం మిరపకాయల కారం గురించే, కారంగా ఉండే మిరియాల వంటి ఇతర పదార్థాల గురించి కాదు.