హెబ్బాకు సెకండ్ లైఫ్ వస్తుందా?

0కుమారి 21ఎఫ్ ఒక్క సినిమాతో పది సినిమాలకు సరిపడా పేరు సంపాదించేసుకుంది యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్. ఎలాంటి ప్రమోషన్ లేకుండా వచ్చిన ఆ సినిమాతో హెబ్బా మెరుపులా మెరిసింది. అందులో హెబ్బా గ్లామర్ కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టేసింది. ఆ తరవాత ఆడో రకం.. ఈడో రకం సినిమాలో చలాకీగా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. హుషారుగా ఉండే నటన.. గ్లామర్ ఆరబోయడంలో పెద్దగా పట్టింపులేవీ లేకపోవడంతో హెబ్బా తొందరలోనే స్టార్ హీరోయిన్ అయిపోతుందని అంచనా వేశారు.

ఈ అంచనాలకు తగ్గట్టుగానే హెబ్బాకు ఒకానొక టైంలో జోరుగా ఆఫర్లొచ్చాయి. మొదటి రెండు సినిమాల తరవాత ఆమె నటించిన వాటిలో ఎక్కడకు పోతావు చిన్నవాడా ఒక్కటే హిట్టయింది. కానీ ఆ సినిమా హిట్ క్రెడిట్ ఎక్కడికి కానీ హెబ్బాకు రాలేదు. ఆ తరవాత నటించిన మిస్టర్ – నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్ – ఏంజెల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో అమ్మడి కెరీర్ గండంలో పడింది. చాలారోజులుగా హెబ్బా చేతిలో సినిమాలే లేవు. ఎట్టకేలకు తన ఫస్ట్ హీరో రాజ్ తరుణ్ తో ఓ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశమొచ్చింది.

తమిళ మూవీ నానుమ్ రౌడీదా రీమేక్ లో హెబ్బా హీరోయిన్ గా నటించనుంది. దాదాపుగా ప్రేక్షకులు మరిచిపోయే పరిస్థితుల్లో ఉన్న టైంలో ఆమెకు వచ్చిన ఈ ఆఫర్ కెరీర్ కు చాలా కీలకం. ఈ రీమేక్ హిట్టయితే కొన్నాళ్లపాటు ఆమెకు సెకండ్ లైఫ్ వచ్చినట్టే. ఆమె కెరీర్ కు ఇంకొన్నాళ్లు ఢోకా ఉండదు. అలా కాకపోతే మాత్రం హెబ్బా తెలుగు తెరపై ఇలా మెరిసి అలా మాయమైపోయిన హీరోయిన్ లెక్క కట్టేయొచ్చు.