మహేష్ 27 కథేంటో తెలుసా?

0

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన మహర్షి ఇటీవలే థియేటర్లలో రిలీజై మిశ్రమ స్పందనలు అందుకుంది. మహేష్ నటన .. పైడిపల్లి ఎంచుకున్న థీమ్ కి ప్రముఖులు సహా కామన్ జనాల నుంచి ప్రశంసలు దక్కాయి. తొలి వీకెండ్ వసూళ్లలో ఫర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ సన్నివేశమేంటి? అన్నదానికి ఈ రెండో వారంలో మరింత స్పష్టత రానుంది.

ఇక మహేష్ ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మహర్షి ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఈ వెకేషన్ ని వాయిదా వేశారు. ప్రస్తుతం కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లేందుకు మహేష్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అట్నుంచి రాగానే నెక్ట్స్ సినిమాల సంగతేంటి? అన్నది ఆలోచిస్తారు. విదేశీ టూర్ ముగించుకుని రాగానే జూన్ లో అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాని ప్రారంభిస్తారు. ఈ సినిమా స్క్రిప్టు ఇప్పటికే పూర్తయింది. ప్రీప్రొడక్షన్ పనుల్లో దర్శక నిర్మాతలు బిజీబిజీగా ఉన్నారు.

మరోవైపు పరశురామ్ సైతం మహేష్ 27 స్క్రిప్టును పూర్తి స్థాయిలో రెడీ చేసి మహేష్ కి ఫైనల్ డ్రాఫ్ట్ వినిపించనున్నారట. ఈ సినిమా కాన్సెప్టుపై తాజాగా ఓ లీక్ అందింది. ప్రస్తుతం దేశంలో నలుగుతున్న ఓ తీవ్రమైన సమస్యపై ఈ చిత్రంలో చూపించనున్నారట. చక్కని సామాజిక సందేశం ఉన్న స్క్రిప్టుని పరశురామ్ రెడీ చేస్తున్నారు. శంకర్ రేంజులో ఇష్యూని టచ్ చేస్తూ.. కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించనున్నారని తెలుస్తోంది. మహేష్ 26 ఎలానూ ఎఫ్ 2 తరహా లైటర్ వెయిన్ కామెడీ ఎంటర్ టైనర్ కాబట్టి.. అటుపై వెంటనే పరశురామ్ తో కలిసి కాస్తంత వెయిట్ వున్న సినిమానే చేయబోతున్నాడట. మహేష్ నటిస్తున్న సినిమాలన్నిటా వరుసగా సందేశాలిచ్చిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు.. భరత్ అనే నేను చిత్రాల్లోనూ చక్కని సందేశం అందించారు. ఒక సినిమాకి గ్యాప్ ఇచ్చి మళ్లీ అద్భుతమైన సందేశాత్మక చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేస్తాడన్నమాట. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మహేష్ 27 కూడా సాధ్యమైనంత తొందర్లోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.
Please Read Disclaimer