మరోసారి పోలీసులకు దొరికిన ఆగ్ర నటుడు!

0తెర మీద హీరోయిజాన్ని ప్రదర్శించే హీరోలు.. తెర వెనుక తమ బుద్దిని ప్రదర్శిస్తూ వేలెత్తి చూపించుకునే అవకాశం ఉంటుంది. కోట్లాది మందికి దక్కని ఇమేజ్ తమకు దక్కినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ.. అడ్డంగా బుక్ కావటం తమిళ హీరో జైకు అలవాటుగా మారింది.

గతంలో డ్రంకన్ డ్రైవ్ తో పాటు ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసేలా వ్యవహరించి జరిమానాలు కట్టినప్పటికీ జైకి బుద్ధి రాలేదని చెబుతున్నారు. ఆ మధ్యన డ్రంకన్ డ్రైవ్లో దొరికిన జైకు జరిమానాను విధించటంతో పాటు.. అతని డ్రైవింగ్ లైసెన్స్ ను ఆర్నెల్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంత భారీ ఎదురుదెబ్బ తగిలిన తర్వాత కూడా జైలో మార్పు రాలేదన్న విషయం తాజా ఉదంతంతో మరోసారి నిరూపితమైంది.

గత సెప్టెంబరులో ఫుల్ గా తాగేసి డ్రైవ్ చేస్తూ శాస్త్రి నగర్ పోలీసులకు దొరికిన జై.. తాజాగా తన విలాసవంతమైన కారుకు నిబంధనలకు విరుద్ధంగా భారీ శబ్దాన్ని చేసే హై డెసిబుల్ సైలెన్సర్ ను ఉపయోగించిన వైనం సీసీ కెమేరాలో రికార్డ్ అయ్యింది. చెన్నైలోని అడయార్ ప్రాంతంలో అతగాడి కారు చేష్టల్ని గుర్తించిన పోలీసులు నోటీసులు జారీ చేశారు.

చేసిన తప్పునకు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పిన జై.. తన కారుకు ఏర్పాటు చేసిన హై డెసిబుల్ సైలెన్సర్ ను వెంటనే తొలగించనున్నట్లుగా పేర్కొన్నారు. తప్పు మీద తప్పు చేస్తూ.. దొరికిన ప్రతిసారీ క్షమాపణలు చెబుతూ.. మళ్లీ తప్పు చేయనని చెప్పే ఈ రీల్ హీరో తీరు చూస్తే.. ఇతగాడినా ఇంతగా అభిమానించేదన్న భావన కలగటం ఖాయం. రీల్ మీద వెలిగిపోయే జై లాంటి హీరోలు రియల్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉండటం చూసినప్పుడు.. ఇలాంటి ప్రముఖులకు కఠిన శిక్షలు విధించినా తప్పు లేదన్న అభిప్రాయం కలుగక మానదు.