బైక్ మీద గుట్టుగా వచ్చి సర్ ప్రైజ్ చేసిన స్టార్ హీరో

0తమ ఆరోగ్యాల్ని.. పర్యావరణాన్ని దెబ్బ తీస్తుందంటూ ఆందోళన చేస్తున్న తూత్తుకూడి ప్రజలపై పోలీసులు అమానుషంగా కాల్పులు జరపటం.. పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన వైనం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో బాధితుల్ని పరామర్శించేందుకు ఎందరో ప్రముఖులు వచ్చారు. వారంతా బాధితుల చేతుల్లో ఊహించని రీతిలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.

చివరకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం తూత్తుకూడి బాధితుల వద్దకు వచ్చి.. వారి చేత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. మీరెవరు? అంటూ అడిగించుకొని వారి ఆగ్రహావేశాల్ని స్వయంగా అనుభవించారు. ఇలాంటి వేళ.. తూత్తుకూడి బాధితుల్ని పరామర్శించేందుకు ఒక స్టార్ హీరో ఊహించని రీతిలో పరామర్శలు చేసి.. అక్కడి వారి మనసుల్ని దోచుకున్నారు.

తమిళ స్టార్ హీరోగా సుపరిచితుడు విజయ్.. తన రియల్ ఫీట్ తో తాజాగా రియల్ స్టార్ గా మారారని చెప్పాలి. తాము చేసే గోరంత సాయానికి కొండంత పేరు ప్రఖ్యాతులు పొందాలనుకునే తీరుకు భిన్నంగా.. గుట్టుచప్పుడు కాకుండా తూత్తుకూడి బాధితుల్ని పరామర్శించేందుకు విజయ్ వచ్చారు.

మంగళవారం రాత్రి వేళ బైక్ మీద తూత్తుకూడికి వచ్చిన విజయ్.. నేరుగా బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లారు. పోలీసుల కాల్పుల్లో మరణించిన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. వారిని పరామర్శిస్తూ.. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయాన్ని అందించారు. ఎక్కడా కూడా తాను వస్తున్నట్లుగా సమాచారం ఇవ్వలేదు.

ఎంత గుట్టుగా వచ్చారో.. అంతే గుట్టుగా బైక్ మీద చెన్నై వెళ్లిపోయారు. విజయ్ తీరు అక్కడి బాధితుల మనసుల్ని దోచుకోవటమే కాదు.. విజయ్ చేసిన సాయం తీరును పలువురు అభినందిస్తున్నారు.రీల్ హీరో కాదు రియల్ హీరో అంటూ మెచ్చుకుంటున్నారు.