యన్.టి.ఆర్-2లో ఏం చూపిస్తారబ్బా?

0

నందమూరి తారక రామారావు బయోపిక్ ‘యన్.టి.ఆర్’ను రెండు భాగాలుగా తీస్తారంట కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమయ్యేలా ఉంది. ఈ రోజు ‘యన్.టి.ఆర్’ అనే పేరుకు ‘కథానాయకుడు’ అనే పదాన్ని జోడించి కొత్త పోస్టర్ వదిలింది చిత్ర బృందం. అంటే తొలి భాగానికి పేరు ‘కథానాయకుడు’ అని.. ఇందులో ఆయన సినీ జీవితాన్ని మాత్రమే చూపిస్తారని జనాలు అర్థం చేసుకుంటున్నారు. రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపిస్తారట. దానికి ‘నాయకుడు’ అని.. ‘రాజకీయ నాయకుడు’ అని.. ‘ప్రజా నాయకుడు’ అని రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఐతే తొలి భాగంలో సినీ ప్రస్థానమంతా చూపించి.. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం మొత్తం రెండో భాగంలో చూపించాలంటే అంత సులువైన విషయమేమీ కాదు.

నిజానికి ఎన్టీఆర్ సినీ ప్రస్థానం కంటే రాజకీయ ప్రయాణమే ఆసక్తికరం. సినీ రంగంలో ఆయన పెద్దగా ఒడుదొడుకులు ఎదుర్కొన్నది లేదు. చాలా వేగంగా స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఉత్థానమే తప్ప పతనమే లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఎదురు లేకుండా సాగిపోయింది ఆయన మహా నట ప్రస్థానం. ఐతే రాజకీయ రంగంలో అలా కాదు. అందులో ఉత్థానపతనాలు రెండూ ఉన్నాయి. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి కావడం పెను సంచలనమైతే.. ఒకటికి రెండుసార్లు వెన్నుపోటుకు గురై ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం.. నా అనుకున్న వాళ్లే నట్టేట ముంచేయడం అంతకుమించిన సంచలనాలు. మొత్తంగా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో కావాల్సినంత డ్రామా.. మలుపులు ఉన్నాయి. ఐతే రెండో వెన్నుపోటుకు సూత్రధారి అయిన చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు సినిమా తీస్తున్నదేమో ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ. ఆయన సినిమాలో బాబును ప్రతికూలంగా చూపించే ప్రయత్నం చేస్తాడని ఎవ్వరూ అనుకోవట్లేదు. మరి అదంతా చూపించకుండా ‘యన్.టి.ఆర్’ రెండో భాగం ఎలా సంపూర్ణమవుతుంది? ఉన్నదున్నట్లు తీస్తే ఆ ఘట్టమే సినిమాకు ప్రధాన ఆకర్షణ కూడా అవుతుంది. కానీ అది చూపించే అవకాశం లేదు. అలాంటపుడు రెండో భాగం తీయడమే వృథా. ముందు అనుకున్న ప్రకారం ఎన్టీఆర్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యే దగ్గరో.. లేదంటే తొలిసారి నాదెండ్ల వెన్నుపోటు తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి కావడం దగ్గరో సినిమాను ఒక్క భాగంతో ముగించేస్తే పోయేది. ఐతే ‘యన్.టి.ఆర్’ సినిమాకు ట్రేడ్ వర్గాల్లో వచ్చిన క్రేజ్ చూసి.. రెండు భాగాలు తీస్తే ఆర్థికంగా మంచి ప్రయోజనం ఉంటుందని ఈ ప్లాన్ వేసినట్లున్నారు. కానీ రెండో భాగం తీయడం అంత సులువు కాదన్న విషయం తీసేటపుడు కానీ అర్థం కాదేమో క్రిష్ బృందానికి.
Please Read Disclaimer