ఏపీలో ఘోర రైలు ప్రమాదం పట్టాలు తప్పిన హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌, 23 మంది దుర్మరణం

0hirakund-express-accidentఏపీలో ఘోర రైలు ప్రమాదం
పట్టాలు తప్పిన హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌
23 మంది దుర్మరణం
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
50 మందికి తీవ్ర గాయాలు

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌ వద్ద ఘెర ప్రమాదం జరిగింది. జగదల్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌ వెళుతున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం రాత్రి 11.30 సమయంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు పడిపోయాయి. ఇందులో ఒక ఏసీ, నాలుగు జనరల్‌, రెండు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు ఉన్నాయి. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. దాదాపు 50మందికిపైనే గాయాలపాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. శనివారం రాత్రి 11.30 నిమిషాలు… ఎటుచూసినా చీకటే… వేగంతో దూసుకొస్తున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌.. అప్పటికే ప్రయాణికులంతా నిద్రలోకి జారుకున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా కుదుపు… కళ్లు తెరిచేలోగా అక్కడంతా హాహాకారాలు.. క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది… అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి…మెల్లగా తేరుకున్న తర్వాత తెలిసింది వారు పయనిస్తున్న రైలు పట్టాలు తప్పిందని… దాంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సంఘటన స్థలంలో పరిస్థితి బీతావాహంగా మారింది. బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు వాటిలో ఇరుక్కు పోయాయి. ఒకదానిపై ఒకటిగా పడిపోయి కనపడుతున్నాయి. బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. చెల్లాచెదురుగా వస్తువులు పడిఉన్నాయి. తమ వారి కోసం వారు ఆతృతగా వెతుకున్న వైనం కంటతడిపెట్టిస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న సహాయ బృందాలు వాటిని తీయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోగీలను కట్‌ చేసి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను పార్వతీపురం పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ సమాచారం అందిన వెంటనే విశాఖ నుంచి హుటాహుటిన సహాయక బృందం బయలుదేరింది. డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ సహా 18 మంది రైల్వే అధికారులు, 8 మంది వైద్యులు ప్రమాద ప్రాంతానికి వెళ్లారు. రాయగఢ్‌ కలెక్టర్‌, జేసీ, విజయనగరం ఓఎస్‌డీ తదితరులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఉలిక్కిపడిన జిల్లా: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రైలు ప్రమాద ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. అంతా నిద్రలోకి జారుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ప్రమాద ఘటన గురించి సంగతే తెలియని పరిస్థితి. దీంతో క్షతగాత్రులకూ ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తర్వాత సమాచారం అందుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చిన్నపాటి గాయాల పాలైన వారిని కూనేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేసి అనంతరం అక్కడి నుంచి పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అసలు ఎంతమంది చనిపోయారో తెలుసుకోలేనంతగా జనరల్‌ కంపార్ట్‌మెంటు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. రాయగఢ్‌, పార్వతీపురం ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పార్వతీపరం ఆసుపత్రికి 18 మందిని తీసుకురాగా అందులో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గీతాంజలి మహంతి, నీలిమ మిస్రో, భగవాన్‌ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వీరు ఒడిశా ప్రాంతానికి చెందివారు. బొబ్బిలి సమీపంలోని కోమటిపల్లికి చెందిన మరల శంకరావు, ఎస్‌.శ్రీనివాసరావు గాయాలపాలైనవారిలో ఉన్నారు.

పక్కనున్న గూడ్సు రైలు వల్ల తీవ్రత తగ్గింది
జగదల్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌ వైపు వస్తున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కూనేరు రైల్వేస్టేషన్‌కు తూర్పు కేబిన్‌ వద్ద పట్టాలు తప్పింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరో పట్టాలపై గూడ్సు రైలు ఆగిఉంది. రైలు ఒక్కసారిగా గూడ్సు రైలుపై ఒరిగిపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు, ప్రయాణికులు పేర్కొంటున్నారు. పట్టాలు తప్పిన ఏడు బోగీల్లో ఎస్‌9 తీవ్రంగా దెబ్బతింది. జనరల్‌, ఎస్‌9 బోగీలు నుజ్జునుజ్జు కావడంతో మృతుల సంఖ్య వీటి నుంచే పెరిగే అవకాశం ఉంది. మిగిలిన బోగీల్లో ఉన్న ప్రయాణికులను విశాఖ, విజయనగరం నుంచి ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో చేరవేసే ఏర్పాట్లు జిల్లా అధికారులు చేశారు. ఘటనా స్థలానికి విజయనగరం జిల్లా, ఒడిశా రాష్ట్రం రాయగఢ్‌ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.