క్రికెటర్లకు అమ్మాయిలను వల వేశారు

0న్యూఢిల్లీ: ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని చెత్త విషయాలు బయటపడుతున్నాయి. క్రికెటర్లకు అమ్మాయిలను వల వేసి, ఆ వ్యవహారాలను వీడియో తీసి, బ్లాక్ మెయిల్ చేయడానికి బుక్కీలు పూనుకున్నట్లు చెబుతున్నారు.

ఆటగాళ్లు తమ మాటను ధిక్కరిస్తే ఆ వీడియో టేపులను బయటపెడతామని హెచ్చరించేందుకు కూడా సిద్ధపడినట్లు చెబుతున్నారు. బుక్కీలు చంద్రేష్ పటేల్ అలియాస్ చంద్, మనన్ అరెస్టయిన శ్రీశాంత్, అజిత్ చండిలకు ఈ ఏడాది ఆరంభంలో ఐదారు సార్లు అమ్మాయిలను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. క్రికెటర్లను, బుక్కీలను విచారించిన పోలీసులు ఆ విషయాలు తెలుసుకున్నారు.

తాము అరెస్టు చేసిన బుక్కీలకు నుంచి స్వాధీనం చేసుకున్న ఐదు ల్యాప్‌టాప్‌లను స్కాన్ చేసి, అటువంటి వీడియోలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ల్యాప్‌ట్యాప్‌లను ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపించనున్నారు. వాటిని ల్యాబ్‌లో మిర్రర్ ఇమేజ్ తీసి భవిష్యత్తు దర్యాప్తునకు వాడుకుంటారు. బుక్కీలు సరఫరా చేసిన అమ్మాయిలతో క్రికెటర్లు ఉన్నప్పుడు వీడియో తీయడానికి వీలుగా కెమెరాలను ఏర్పాటు చేశారా, లేదా అనే విషయం కూడా సంభాషణల్లో బయటపడినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి దుబాయ్ ఫోన్ నుంచి ఢిల్లీ, ముంబై ఫోన్లకు మధ్య సంభాషణ జరిగినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కనిపెట్టారు. అటువంటి వీడియో టేపులను రూపొందించారా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. అమ్మాయిలను క్రికెటర్లకు ఎర వేశారనే అనుమానాలపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేయాల్సే ఉంది.