మాజీ భార్యతో రాజీకి నో అన్న సూపర్‌స్టార్‌

0Hrithik-Roshan-Suzanneహృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ ‘కాబిల్‌’ చిత్రంపై చూపించిన పబ్లిక్‌ లవ్‌ చూసి ఈ జంట మళ్లీ దగ్గరవుతున్నారని అనుకున్నారు. సుసానే ప్రశంసలకంటే తనకి మించినవి ఏవీ లేవని హృతిక్‌ అనడంతో విడాకుల తర్వాత వీరి బంధం బలపడుతుందనే సంకేతాలు అందాయి.

ఒకరిని ఒకరు హత్తుకుని కనిపించిన ఈ జంట త్వరలో ఏకమవుతారేమో అని చర్చ జరుగుతోంటే, అలాంటిదేం ఉండదని హృతిక్‌ తేల్చేసాడు. తన జీవితంలో పెళ్లి అనే చాప్టర్‌ ముగిసిపోయిందని, ఇక మళ్లీ దానిని తెరిచే ఆలోచన పెట్టుకోవడం లేదని, ప్రేమ ఎప్పటికీ ఉంటుందని, అది జీవితంలో భాగమని, కానీ పెళ్లి మాత్రం ముగిసిందని హృతిక్‌ అన్నాడు.

భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తల్లిదండ్రులుగా తమ పిల్లల పట్ల బాధ్యత తమకి ఉందని, అంచేత తమ ఇద్దరి బంధం పూర్తిగా తెగిపోవడం ఎప్పటికీ జరగదని హృతిక్‌ చెప్పాడు. కాబిల్‌ చిత్రం షారుక్‌ రయీస్‌తో పోటీ పడడం దురదృష్టకరమని అంటూనే రెండు సినిమాలు బాగా ఆడాలని అభిలషించాడు.

మరోవైపు షారుక్‌ కూడా ఈ క్లాష్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు. భవిష్యత్తులో ఇలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల కాకూడదని అభిప్రాయపడ్డాడు.