ఆరెక్స్ దర్శకుడికి ఆఫర్ల వెల్లువ!

0ఇప్పుడున్న క్రియేటివ్ యూత్ దర్శకులు సక్సెస్ కి కొత్త అర్థం చెబుతున్నారు. స్టార్ హీరోలు లేకుండా బడా బడ్జెట్ అవసరం రానివ్వకుండా సంచలన విజయాలు సాధిస్తూ మార్గనిర్దేశనం చేస్తున్నారు. గత ఏడాది అర్జున్ రెడ్డితో సందీప్ రెడ్డి వంగా ఇది రుజువు చేయగా ఇప్పుడు ఆ బాధ్యతను ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి నిర్వర్తించాడు. గత మూడు రోజులుగా ఇతని ఫోన్ నాన్ స్టాప్ ఇన్ కమింగ్ తో మోగిపోతోంది. అభినందనల కోసం కాదు తమ బ్యానర్ లో సినిమాకు అడ్వాన్స్ తీసుకోమని నిర్మాతల ఫోన్ కాల్స్ వల్ల. కార్తికేయ లాంటి ఒక్క సినిమా అనుభవం ఉన్న హీరోతోనే ఇంత ఇంటెన్సిటీతో తీయగలిగినప్పుడు సీనియారిటీ ఉన్న హీరోలతో ఇంకా బాగా తీయొచ్చు అనే అంచనా కలగడం సహజం. ఆరెక్స్ 100 బాగా బడ్జెట్ పరిమితుల్లో తీసినది. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది కూడా. ఆ విషయంలో స్వేచ్ఛ ఇస్తే ఇంకెంత బాగా అవుట్ ఫుట్ రాబడుతాడో అని అజయ్ భూపతి కోసం నిర్మాతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు.

గోపీచంద్ తో నాలుగు సినిమాలు చేసిన భవ్య క్రియేషన్స్ ఆనంద ప్రసాద్ ముందువరసలో ఉన్నారట. గోపిచంద్ కి సాలిడ్ సబ్జెక్టు పడితే మళ్ళి ఫామ్ లోకి వస్తాడు కాబట్టి దానికి అజయ్ అయితేనే కరెక్ట్ అని భావించి సంప్రదించినట్టు టాక్. మరోవైపు రామ్ కోసం స్రవంతి అధినేత రవి కిషోర్ కూడా కాల్ చేసినట్టు వినికిడి. శ్రీనివాస కళ్యాణం రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా తమ శ్రేష్ఠ బ్యానర్ కోసం అజయ్ భూపతిని లాక్ చేసే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. వీళ్ళే కాదు ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన అగ్ర నిర్మాత కూడా ఫోన్ చేశారట. వీటి మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్న అజయ్ భూపతి ఫైనల్ గా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆరెక్స్ 100 ప్రమోషన్ తో పాటు ఫుల్ రన్ పూర్తయ్యాకే నిర్ణయం తీసుకునే దిశగా అజయ్ భూపతి ప్రస్తుతానికి అన్ని హోల్డ్ లో పెట్టాడని టాక్.