ఎన్టీఆర్ ముందు ఓవర్సీస్ ఛాలెంజ్

0స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి బయోపిక్ గా రూపొందుతున్న ఎన్టీఆర్ షూటింగ్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. క్రమం తప్పకుండ ఎప్పటికప్పుడు సందర్భాలను వాడుకుంటూ టీమ్ విడుదల చేస్తున్న పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎన్టీఆర్ జీవితం తాలూకు విశేషాలను ఏ కోణంలో చూపించబోతున్నారు ఎంతవరకు ఇందులో నిజానిజాలు ఉంటాయనే దాని గురించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ ను టార్గెట్ గా పెట్టుకున్న ఎన్టీఆర్ బిజినెస్ లావాదేవీలు అప్పుడే మొదలయ్యాయని టాక్. చేతిలో ఉన్నది నాలుగు నెలల సమయం మాత్రమే కాబట్టి ఆలోపే అన్ని చక్కదిద్దే యోచనలో ఉన్నారు ముగ్గురు నిర్మాతలు. ఇక ఓవర్సీస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్ డేట్ ఫ్యాన్స్ కి మంచి హుషారు ఇస్తోంది. ఇప్పటి దాకా బాలయ్య సినిమాలు ఏవి యుఎస్ గొప్పగా చెప్పుకోదగ్గ రీతిలో పెర్ఫర్మ్ చేయలేదు. 2 మిలియన్ మార్క్ అనేది ఇప్పటికీ అందని ద్రాక్షలాగే ఉంది.

కానీ ఇప్పుడు ఈ ఎన్టీఆర్ మాత్రం ఆ లెక్కలు సరిచేసే మొత్తంలో హక్కులు అమ్ముతున్నారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో ఎన్టీఆర్ ఓవర్సీస్ హక్కులకు గాను 20 కోట్ల దాకా ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఇది ఏ యాంగిల్ లో చూసుకున్నా పెద్ద పెట్టుబడే. పెద్ద తారలు ఎవరూ లేకుండానే సావిత్రి గారి బయోపిక్ అంత ప్రభంజనం సృష్టించినప్పుడు స్టార్ హీరో ఉన్న ఎన్టీఆర్ ఇంకెంత రేంజ్ లో ఆడుతుందో అనే అంచనాలో ఇది జరిగినట్టు వినికిడి. ఇదే కనక నిజమైతే బాలయ్య ముందు పెను సవాల్ నిలిచినట్టే. దర్శకుడు క్రిష్ కావడం బిజినెస్ పరంగా మరో పెద్ద ప్లస్ గా మారుతోంది. క్రిష్ మేకింగ్ స్టైల్ ఓవర్సీన్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. ఇన్ని ప్లస్సులు చూసుకున్నారు కాబట్టే ఎన్టీఆర్ కు అంత రేట్ పలికినట్టు ఉంది. త్వరలో బసవతారక సమేత ఎన్టీఆర్ లుక్ ని బాలయ్య-విద్యా బాలన్ జంట రూపంలో విడుదల చేయబోతున్నారు. దాని కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు.