2కోట్ల పొలం కొన్న హైపర్ ఆది!!?

0

బుల్లితెర రియాలిటీ కార్యక్రమం `జబర్ధస్త్` ఎందరికో ఉపాధినిచ్చింది. కొందరికి టాప్ క్లాస్ లైఫ్ నే ఇచ్చింది. ఆ కొందరిలో హైపర్ ఆది ఒకడు. అతి తక్కువ సమయంలో జబర్దస్త్ షో వల్ల పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్ – పంచ్ లతో ఆడియన్స్ ను నవ్విస్తుంటాడు. గురు – శుక్రవారాల్లో జబర్ధస్త్ వీక్షణ కోసం రెడీ అయ్యే వారిలో ఆది ఏదైనా కొత్తగా చేస్తాడనే నమ్మకం ఉంది. అతడి స్కిట్స్ ప్రస్తుత ట్రెండ్ కి తగ్గ టాపిక్స్ తో ఉంటాయి కాబట్టి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. జబర్ధస్త్ నుంచి సినిమాల వరకూ అతగడి ప్రయాణంలో ఒడిదుడుకులు ఎన్నో ఉన్నాయి. ఆది ఎంతో కష్టపడ్డాడు. మారుమూల పల్లెటూరి నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం -పల్లాం అనే గ్రామం అతడిది. కోట నరసింహాం – శారద తల్లిదండ్రులు. రైతు కుటుంబంలో జన్మించి పల్లాం గ్రామంలోనే 8 వరకూ – మద్దిపాడు నాగార్జున స్కూల్ లో 10 వరకూ చదివాడు. తర్వాత ఇంటర్ శ్రీ చైతన్యలో చదివి బీటెక్ ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో పూర్తి చేశాడు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. స్నేహితులతో కలిసి జాబ్ కోసం చాలానే ప్రయత్నించాడు.

ఆ క్రమంలోనే `అత్తారింటికి దారేది` మూవీ చూసి ఆ సినిమా క్లైమాక్స్ పేరడీ వీడియోలో నటించి దానిని యూట్యూబ్ లో పెట్టాడు. అదిరే అభి ఆ స్కిట్ చూసి ఇంప్రెస్ అయిపోయి – తమకు స్క్రిప్టు రాయాలని కోరాడు. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని – జబర్ధస్త్ కోసం చాలా స్క్రిప్టులు రాశాడు. జబర్ధస్త్ దర్శకులు నితిన్ – భరత్ లు ఆదిని బోలెడంత ఎంకరేజ్ చేశారు. అక్కడ స్క్రిప్టు రైటర్ గా పని చేయడంతో పాటు – స్వయంగా నటించాలని దర్శకులు కోరడంతో నటుడయ్యాడు. టీవీ తెరపై నటుడిగా వెలిగాక అట్నుంచి సినిమాల్లోనూ బిజీ అవుతున్నాడు.

ఇకపోతే ఆదికి చిరంజీవి – పవన్ అంటే చాలా అభిమానం. వాళ్లపై ఈగను కూడా వాలనివ్వడు. కత్తి మహేష్ – పవన్ ఫైటింగ్ ఎపిసోడ్స్ లో ఆది పవన్ కి మద్దతు గా కత్తిపై ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. అదంతా అటుంచితే హైపర్ ఆది `జబర్థస్త్` కార్యక్రమంతో రచయితగా – నటుడిగా బాగానే సంపాదించాడు. సొంత ఊళ్లో 2కోట్ల విలువ చేసే పొలం కొనుక్కున్నాడని సన్నిహితులు చెబుతున్నారు.
Please Read Disclaimer