ఝాన్సీ లక్ష్మీబాయి పై రాఖీ కామెంట్స్

0rakhi-sawantతరచు వివాదాస్పద ప్రకటనలు, చర్యలతో వార్తలలో కనిపించే బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ మరోసారి అదే పని చేసింది. ప్రజాస్వామ్యంలో మాట్లాడాలంటే ఏ ఒక్కరూ భయపడకూడదని చెప్పింది. రాణీ ఝాన్సీ లక్ష్మీబాయిలాగే తనకూ భయమంటే ఏంటో తెలియదని అంటోంది. వాల్మీకి కులస్తుల సెంటిమెంట్లను దెబ్బతీసినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయడం, కోర్టులో విచారణకు హాజరు కాకపోవడంతో ఆమెపై అరెస్టు వారెంటు జారీచేసి, చివరకు అరెస్టు చేయడం లాంటివి తెలిసిందే. తన కెరీర్‌ను నాశనం చేయడానికి కొంతమంది తనను అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని, తాను ఎవరి సెంటిమెంట్లను దెబ్బ తీయలేదని రాఖీ చెప్పింది. అయినా దీనిపై వివాదం రేగడంతో తాను క్షమాపణలు చెబుతూ ఆన్‌లైన్‌లో ఒక వీడియోను కూడా అప్‌లోడ్‌ చేశానని తెలిపింది.

తాను కూడా రాణీ లక్ష్మీబాయి లాగే ధైర్యవంతురాలినని, తనను వివాదాల్లోకి లాగేవాళ్లందరిపై పోరాడుతానని వివరించింది. తాను సమస్యలు ఎదుర్కోవడం ఇది మొదటిసారి ఏమీ కాదని, చాలాసార్లే ఇలా చేశారని అంటోంది. వాల్మీకి మహర్షిలాగే గాయకుడు మికా సింగ్‌ కూడా చెడు నుంచి మంచికి మారారని ఆమె ఒక షో సందర్భంగా వ్యాఖ్యానించింది. దాంతో వాల్మీకి కులస్థులు ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. తాను మికా సింగ్‌కు మద్దతుగా మాట్లాడినా, చివరకు అతడు కూడా స్పందించలేదని రాఖీ సావంత్‌ వాపోయింది. అయితే బాలీవుడ్‌ నటులు మాత్రం తనకు మద్దతుగా మెసేజిలు పెడుతున్నారని వివరించింది. ఆమిర్‌ ఖాన్, అనుపమ్‌ ఖేర్‌ లాంటి పెద్ద నటులు తనకు మద్దతునిస్తూ మెసేజిలు పెట్టారని రాఖీ చెప్పింది.