వైసీపీ, జనసేనలోకి చేరడం లేదు: శివాజీ

0


Sivaji-with-partysతాను వైసిపిలో చేరనున్నట్లు వస్తున్న వార్తలను నటుడు శివాజీ కొట్టి పారేశారు. గతంలో జనసేనలో చేరుతారని, ఇటీవల వైసిపిలో చేరుతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న శివాజీని చేర్చుకుంటే పార్టీకి లాభం ఉంటుందని వైసిపి నేతలు, ఆ పార్టీ అధినేత జగన్ కూడా భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో జగన్ సూచనల మేరకు చర్చలు జరిగాయని ప్రచారం సాగింది.

దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. గతంలో తాను జనసేనలో చేరనున్నట్లు, ఇప్పుడు వైసిపిలోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఏమాత్రం వాస్తవం లేదన్నారు.

ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపై ఉందన్నారు. పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తిగా, పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిగా తనను ప్రజలు చీదరించుకోవాలని కోరుకోవడం లేదన్నారు.

అలాగే, కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో వస్తున్న దారుణమైన కామెంట్ల పైన కూడా శివాజీ స్పందించారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా హోదా ఇస్తానని చెప్పిన మోడీని గొప్పవాడిగా, యోగ్యుడిగా, దేశాన్ని రక్షించడానికి వచ్చిన గొప్ప నేతగా మనం భుజన మోయడం సరైంది కాదన్నారు. మోడీ కూడా ఇచ్చిన మాట తప్పారన్నారు.

మన దేశంలో జరిగిన గొప్ప ఆర్థిక సంస్కరణల్లో బ్యాంకుల జాతీయీకరణ ఒకటి అని, అది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేశారని, అలాంటి మహిళ వ్యక్తిగత విషయాలపై దిగజారుడు రాజకీయాలు సరికాదన్నారు. గతంలో బిజెపికి నిజాయితీగా పని చేశానని, ఇప్పుడు ఆ పార్టీతో సంబంధం లేదన్నారు.

ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు ఒకేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో చేరినా ఏముంటుందన్నారు. తాను మాత్రం వ్యక్తిగతంగా ప్రజల కోసం గొంతు వినిపిస్తానని చెప్పారు.

కులం, మతం, వర్గం మీద ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. 2009 నుంచి సినిమాలకు దూరమై, రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మళ్లీ సినిమాలు చేయబోతున్నానని చెప్పారు.