ఊహకు మించిన విజయం: క్రిష్

0Krish-speechనందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నిన్న విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాలయ్య హీరోగా నటించిన వందో సినిమా కావడం, విలక్షన దర్శకుడు క్రిష్ సినిమా కావడంతో శాతకర్ణిపై మొదట్నుంచీ మంచి అంచనాలుండగా, సినిమా విడుదలతోనే ఆ అంచనాలను అందుకుంది. ఇటు ప్రేక్షకులు, అభిమానులనే కాక సినీ ప్రముఖులను సైతం మెప్పించిన సినిమాపై అంతటా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక ఇంతటి విజయాన్ని తాను ఊహించలేదని, తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి కథ తీస్తే దాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ క్రిష్ ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న ఆయన, అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. “ఇలాంటి ఒక కథను ఎంచుకొని, తనకు అన్నివిధాలా అండగా నిలబడ్డ బాలయ్య గారికి థ్యాంక్స్ చెబుతున్నా. నా కెరీర్‌లో ఇప్పటివరకూ ఇంత పెద్ద విజయాన్ని నేను చూడలేదు. ఈ సంక్రాంతి ఎంతో సంతోషాన్నిచ్చింది.” అన్నారు. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో శ్రియ హీరోయిన్‌గా నటించారు.