తెలిసిన వ్యక్తే నన్ను రేప్‌ చేశాడు: నటి

0abigail-breslinతనకు బాగా తెలిసిన వ్యక్తే తనపై లైంగికదాడి చేశాడని అమెరికన్‌ నటి ఎబిగెయిల్‌ బ్రెస్లిన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని కారణాల వల్ల ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పింది. ఇంతకు ముందు కూడా కొందరు హాలీవుడ్‌ నటులు తాము ఓ దశలో లైంగికదాడికి గురయ్యామని వెల్లడించారు.

తనకు అన్యాయం జరిగినా మౌనం ఉండటం వెనుక గల కారణాలను 21 ఏళ్ల బ్రెస్లిన్‌ వెల్లడించింది. చాలా రేప్‌ కేసుల్లో నిందితులకు శిక్ష పడలేదని ఆమె వాపోయింది. ‘నాపై లైంగికదాడి జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేయను. ఇందుకు చాలా కారణాలున్నాయి. అప్పట్లో నేను పూర్తిగా షాక్‌లో ఉన్నాను. నేను బాధితురాలిగా కనిపించాలని భావించడం లేదు. రేప్‌ చేసిన వ్యక్తితో నాకు రిలేషన్‌షిప్‌ ఉంది. అతను నన్ను రేప్‌ చేశాడని చెప్పినా పోలీసులు నమ్మరనే భయముంది. ఈ కేసు నిలబడకుంటే అతను నన్ను మరింత బాధిస్తాడు. అలాగే నా కుటుంబ సభ్యులను, స్నేహితులను బాధపెట్టకూడదని ఈ విషయం ఎవరికీ చెప్పలేదు’ అంటూ బ్రెస్లిన్‌ చెప్పింది. ఏడాదిన్నర క్రితం ఈ దారుణం జరిగినట్టు తెలిపింది. లైంగికదాడి బాధితులకు అండగా నిలుస్తూ ఆమె తన గతాన్ని వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకున్నానని, చాలా పురోగతి కనిపించిందని, అయితే గతం గుర్తుకు వచ్చినపుడు బాధ కలుగుతుందని వాపోయింది.