పెళ్లికన్నా పిల్లలే ఇష్టం : శృతి హాసన్‌

0sruthi-haasanఈతరం హీరోయిన్లలో తెలుగు, తమిళ, హిందీ సినిమా పరిశ్రమల్లో విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్నది శృతి హాసన్‌ ఒక్కరేనని చెప్పాలి. ‘కాటమరాయుడు’తో తెలుగు ప్రేక్షకులముందుకు మరోసారి వస్తోన్న సందర్భంగా తన గురించి శృతి ఏంచెబుతోందంటే…

నానమ్మ పేరు
నాకు వూహ తెలిసినప్పట్నుంచీ గాలీ, ఆహారంలా సంగీతం కూడా జీవితంలో భాగమైపోయింది. నాన్నమ్మ పేరు రాజ్యలక్ష్మి. అదే నా అసలు పేరు కూడా. సంగీతంపైన నా ఇష్టాన్ని చూసి చిన్నపుడే శృతి అని పిలవడం మొదలు పెట్టారు. పాటలు రాస్తుంటాను, పాడతాను, కంపోజ్‌ చేస్తుంటాను. నాకు సినిమాలూ, సంగీతం రెండూ ముఖ్యమే! గతేడాది బ్రిటన్‌కు చెందిన మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘డైనోసార్‌ పైలప్‌’తో కలిసి ఒక ఆల్బమ్‌ చేశాను. భవిష్యత్తులో మరిన్ని ఆల్బమ్‌లు తీసుకొస్తాను.
గబ్బర్‌సింగ్‌ మార్చేసింది…
నా మిగతా సహనటులకంటే పవన్‌ కల్యాణ్‌ ఎంతో ప్రత్యేకం. కెరీర్‌ ప్రారంభంలో మూడేళ్లపాటు నాకు హిట్‌లేదు. ‘ఐరన్‌ లెగ్‌’ అని ప్రచారం చేశారు. కానీ పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌ తాము ముందుగా అనుకున్నట్టుగానే గబ్బర్‌సింగ్‌లో నన్ను కొనసాగించారు. ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది. నాపైన ఉన్న అపవాదుని పోగొట్టింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోనేకాదు, కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ అవకాశాలు వచ్చాయి. పవన్‌, హరీష్‌… వారిద్దరంటే నాకు ఎప్పటికీ ప్రత్యేక గౌరవం ఉంటుంది.
నాన్న రాజీపడరు…
నాన్నతో త్వరలో రాబోతున్న ‘శభాష్‌ నాయుడు’లో చేశాను. ఆయనతో పనిచేయడం అంత సులభం కాదు. ఆయనది దేన్నీ తేలిగ్గా తీసుకునే స్వభావం కాదు. సెట్‌లో అందరూ తనలానే కష్టపడాలనుకుంటారు. అందుకే మొదట నేను కాస్త భయపడ్డాను. కానీ ఆయనతో కలిసి పనిచేస్తుంటే మనకూ ఆటోమేటిగ్గా ఉత్సాహం వచ్చి బాగా పనిచేస్తాం.
ఆనాటి ప్రేమ మధురం
ఓసారి నాన్నతో ‘ప్రేమ… నాడు-నేడు’ అన్న విషయం చర్చకు వచ్చింది. సెల్‌ఫోన్లూ, వాట్సాప్‌ లాంటివి లేకపోవడంవల్ల ఆరోజుల్లో వ్యక్తుల్ని నేరుగా కలిసి మాట్లాడేవారనీ సగం ప్రేమకథలు అలా కలిసినపుడే పుట్టేవనీ నాన్న చెప్పారు. ప్రియుడు/ప్రేయసి నుంచి ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ రావడం, ఇంట్లోవాళ్లకి తెలియకుండా మాట్లాడటం లాంటివి ఈతరం మిస్సయిపోయింది. హిందీలో నేను చేస్తున్న ‘బహన్‌ హోగీ తేరీ’ సినిమాలో ఆ ప్రేమను చూడొచ్చు.
నటనలో శిక్షణ...
పదేళ్లనుంచీ తీరికలేకుండా సినిమాల్లో చేస్తున్నాను. చాలా సమయం సెట్‌, హోటల్‌, విమానం… వీటితోనే గడిచిపోయింది. కానీ ఏ మూలనో అసంతృప్తి. అందుకే గతేడాది లండన్‌లో ‘లియానా’ అనే ఆమె దగ్గర ‘మూమెంట్‌ కోచింగ్‌’లో శిక్షణ తీసుకున్నాను. అక్కడికి వెళ్లాక నా శరీరాన్ని ఇంకా బాగా అర్థం చేసుకున్నాను. కొత్త విషయాలు చదవడం, నేర్చుకోవడం, కొత్తవారిని కలవడంవల్ల నాలోనే కాదు, నా నటనలోనూ చాలా మార్పు వచ్చింది. నా కొత్త సినిమాల్లో ఈ తేడాల్ని మీరు గమనించవచ్చు.
పిల్లలంటే ఇష్టం
నేనెపుడూ వ్యక్తిగత విషయాల్ని బయటకు చెప్పను. అలా చెప్పడం ఇష్టం ఉండదు. దాంతో నాగురించి రకరకాల పుకార్లు వస్తాయి. ఒకవేళ పెళ్లిచేసుకుంటే ఆరోజు వరకూ ఆ అబ్బాయి ఎవరనేది బయటకు చెప్పను కూడా. నాకు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ఉంది. భర్త, వివాహబంధం- వీటికంటే కూడా పిల్లల కోసం పెళ్లిచేసుకోవాలనుకుంటున్నా. పిల్లలంటే అంత ఇష్టం.
లండన్‌ బావుంటుంది
సినిమాల్లో భాగంగా తరచూ కొత్త ప్రదేశాలు చూస్తుంటాను. టర్కీలోని ‘పముక్కలే’ ప్రాంతానికి వెళ్లినపుడు స్వర్గమంటే అలానే ఉంటుందేమో అనిపించింది. నగరాలపరంగా లండన్‌ బాగా నచ్చుతుంది. చాలాసార్లు వెళ్లాను కూడా. అక్కడ బోలెడుమంది స్నేహితులున్నారు. చల్లని వాతావరణం, ఉత్సాహభరితమైన జీవనశైలి ఉంటుంది. అక్కడ ఎన్నిరోజులున్నా బోర్‌ కొట్టదు.