అభిమానులకు కమల్ తీపి కబురు

0ఒక పెద్ద హీరో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడంటే అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. రాజకీయాల్లోకి రావడం సంతోషమే కానీ.. అందుకోసం సినిమాలు మానేస్తానంటేనే అభిమానులకు రుచించదు. చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. రజనీకాంత్.. కమల్ హాసన్.. ఇలా వీళ్లందరి విషయంలోనూ ఇలాంటి స్పందనే వచ్చింది. వీళ్లందరూ కూడా రాజకీయాల కోసం సినిమాకు దూరమవ్వాలన్న ఆలోచన చేసిన వాళ్లే. ఐతే వీళ్లలో చిరంజీవి పొలిటికల్ కెరీర్ కు బ్రేక్ పడటంతో తిరిగి సినిమాల వైపు వచ్చేశాడు. పవన్ కళ్యాణ్ సంగతి తెలియదు. రజనీ విషయంలోనూ అయోమయం నెలకొంది. ఐతే కమల్ హాసన్ మాత్రం ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు చేయనని ఇంతకుముందు ప్రకటించిన కమల్.. ఇప్పుడు మాట మార్చాడు.

రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా – సినిమాల్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని కమల్ తాజాగా వ్యాఖ్యానించాడు. విశ్వరూపం–2 సాధించే విజయాన్ని బట్టి భవిష్యత్తులో విశ్వరూపం–3 తీయడానికి తాను సిద్ధమేనని కమల్ ప్రకటించాడు. గతంలో ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమాల్లో నటించారని గుర్తుచేస్తూ.. తానూ రాజకీయాల్లో ఏ స్థాయికి వెళ్లినా సినిమాల్లో కొనసాగుతానన్నాడు. ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుని ప్రజాసేవలో కొనసాగడం కష్టమని.. కాబట్టి ఆదాయం కోసం సినిమాల్లో నటిస్తూనే ఉంటానని కమల్ స్పష్టం చేశాడు. ఇక ‘విశ్వరూపం’ గురించి మాట్లాడుతూ.. ఈ కథ ఎప్పుడో సిద్ధం చేసుకున్నా – దశావతారం.. మన్మథన్ అంబు లాంటి సినిమాల వైపు తన మనసు వెళ్లిపోయిందన్నాడు. దేశం రెండుగా చీలడానికి ప్రధాన కారణం మత రాజకీయాలేనన్న అంశం మేరకు ఈ కథ పుట్టుకొచ్చిందన్నాడు కమల్. ఐతే ఇందులో రాజకీయాలకు ఆస్కారం లేదని.. అమెరికాకు వత్తాసు పలికే అంశాలు లేవని స్పష్టంచేశాడు. ఈ చిత్రంలో తన పార్టీ గురించి.. ఇతర అంశాల గురించి ఎలాంటి ప్రస్తావన ఉండదని కమల్ చెప్పాడు.