ఏ పార్టీకీ నేను వ్యతిరేకం కాదు

0telangana-gave-me-re-birthకరీంనగర్‌: ‘ఆంధ్ర నాకు జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో బాధ్యతాయుతమైన రాజకీయాలు చేస్తా’అని జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తన ప్రాణాలు కాపాడిన కొండగట్టు ఆంజనేయస్వామికి, తెలంగాణ నేల తల్లికి తుదిశ్వాస విడిచే దాకా రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అందుకే తెలంగాణకు గుండెకాయ లాంటి కరీంనగర్‌ నుంచే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు.

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం సీతారాంపూర్‌లోని శుభం గార్డెన్స్‌లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం మంగళవారం జరిగింది. జై తెలంగాణ నినా దం వింటే అణువణువూ పులకరిస్తుందని, అది వందేమాతరంలా గొప్పదని అన్నారు. జై తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతిభావంతులైన యువతకు జనసేన పార్టీ అవకాశం కల్పిస్తుందన్నారు. జనసేన పూర్తి స్థాయి ప్రణాళిక మార్చి 14న ప్రకటిస్తామన్నారు.

2019 ఎన్నికల్లో జనసేన సత్తా, శక్తి, బలం ఎంతో తేల్చుకునేందుకు సన్నద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘జనసేన యువత ఆకాంక్ష.. ఆడపడుచుల ఆకాంక్ష.. తెలంగాణ ప్రజల ఆశయాలను నిలబెడుతుంది.. మీరు నాకు అండగా నిలవండి.. నాకు పునర్జన్మనిచ్చిన తెలంగాణకు సేవ చేసే భాగ్యం కల్పించండి.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సుదీర్ఘ రాజకీయ పోరాటాలకు సిద్ధంకండి.. ఒక ఆలోచన పైకి ఎదగడానికి పాతికేళ్ల సమయం పడుతుంది.

యుద్ధం చేసి తెలంగాణను ఎలా సాధించుకున్నారో అదే స్ఫూర్తితో అభివృద్ధి, అవినీతిలేని సమాజం, ఆశ్రిత పక్షపాతం లేని రాజకీయాల కోసం రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలి’అని పిలుపునిచ్చారు. ‘మీతో పాటే పోరాటాలకు నేనూ సిద్ధం. మాట ఇచ్చాను. తప్పను. వెనకడుగు వేయను. వచ్చి పోయేవాడిని కాదు. ప్రజా సంక్షేమం కోసం అవసరాన్ని బట్టి దూకుడుగా. రాజీధోరణితో వ్యవహరిస్తా. నాకు డబ్బులు అవసరం లేదు. ఎన్ని వేల కోట్లు ఇస్తే మీ ప్రేమ దొరుకుతుంది’అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.

ఏడు సిద్ధాంతాలతో ముందుకు..

జనసేన పార్టీ 7 సిద్ధాంతాలతో ముందుకెళ్తుందని పవన్‌ ప్రకటించారు. కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం, పర్యావరణను పరిరక్షించే విధానాలపై ఎలా వెళ్లాలనే దానిపై ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. జై తెలంగాణ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్‌ జై తెలంగాణ.. జై హింద్‌తో ముగించారు.

కేసీఆర్‌ అంటే ఇష్టం..

సీఎం కేసీఆర్‌ అంటే ముందు నుంచే తనకు ఇష్టమని, ప్రజల కోసం నిరంతరం తపించే వ్యక్తిగా గౌరవిస్తానని పవన్‌ అన్నారు. ‘కేసీఆర్‌ స్మార్ట్‌గా పనిచేస్తున్నారంటే కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఏ పార్టీకీ నేను వ్యతిరేకం కాదు. మా అన్నయ్య చిరంజీవి కూడా కాంగ్రెస్‌ నాయకుడేనన్న విషయాన్ని మరవొద్దు. ఆంధ్రా, తెలంగాణ నాకు వేరు కాదు. దేశం కోసమే నా గుండె కొట్టుకుంటుంది.

తెలంగాణ కోసం రక్తమైనా ఇస్తా. తెలంగాణ నాలుగేళ్ల పసిబిడ్డ. ఆ పసిబిడ్డను అన్ని పార్టీలు కలసి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది’అన్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే రోడ్డెక్కుతానని పేర్కొన్నారు. ప్రతి ఒక్క రూ తెలంగాణ యాస, భాష, సంస్కృ తిని గౌరవించాలని కోరారు. బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ, సదర్‌ ఉత్సవాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.