మావయ్యతో ఢీ అంటున్న మేనల్లుడు!

0గతంలో సినిమా హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ అంటే అభిమానులకు ఒక యుద్ధంలా ఉండేది. ఇప్పుడు మాత్రం పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చింది. ఒకే ఫ్యామిలీలో పలువురు హీరోలు ఉండడంతో సేమ్ ఫ్యామిలీ హీరోల మధ్య కూడా పోటీ తప్పడం లేదు. గత రెండు మూడేళ్లలో నందమూరి ఫ్యామిలీ హీరోల మధ్య ఒక సారి అలాంటి పోటీ వచ్చింది. అంతే కాకుండా మెగా హీరోల మధ్య కూడా అలాంటి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ అనివార్యమైంది.

తాజాగా అక్కినేనివారు కూడా ఈ లిస్టు లో జాయిన్ అయ్యారు. కాకపోతే డబల్ కాంపిటీషన్.. అర్థం కాలేదా? ఆల్రెడీ నాగ చైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’.. సమంతా చిత్రం ‘U టర్న్’ సెప్టెంబర్ 13 న బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీకి రెడీ అయ్యాయి. ఈ పోటీ కాకుండా మామ అల్లుళ్ళు కూడా పోటీకి రెడీ అయ్యారు. అక్కినేని నాగార్జున – నాని లు కలిసి నటించిన ‘దేవదాస్’ సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల తేదీని చాలా రోజుల క్రితమే నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా నటించిన ‘ఇదం జగత్’ సినిమాను సెప్టెంబర్ 28 న రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంటే ఒక్కరోజు గ్యాప్ లో నాగ్ – సుమంత్ లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నారు.

కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ‘ఇదం జగత్’ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ కథాంశం తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా హాలీవుడ్ చిత్రం ‘నైట్ క్రాలర్’ కు ఇన్స్పిరేషన్ అనే టాక్ కూడా ఉంది. సో.. స్ట్రాంగ్ కంటెంట్ ఉండే సినిమానే. ఇక ‘దేవదాస్’ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చూద్దాం ఈ అక్కినేని వారి బాక్స్ ఆఫీస్ పోటీల్లో ఎవరు విజేతలుగా నిలుస్తారో!