‘ఇడియట్‌’ హీరోయిన్‌ కమ్‌బ్యాక్‌!

0‘ఇడియట్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక రక్షిత. ఆమె చాలా ఏళ్ల తర్వాత ఓ సినిమా కోసం పనిచేశారు. రక్షిత భర్త ప్రేమ్‌ దర్శకత్వం వహించిన సినిమా ‘విలన్’. కన్నడ నటులు శివ రాజ్‌కుమార్‌, సుదీప్.. అమీ జాక్సన్‌, శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రక్షిత… నటి అమీ జాక్సన్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారట. తన భర్తతో కలిసి పనిచేయడం గురించి రక్షిత ఓ పత్రికతో ఇలా పంచుకున్నారు. ఆయన ఎందులోనూ రాజీపడరని పేర్కొన్నారు.

‘ప్రేమ్‌ పూర్తిగా టాస్క్‌ మాస్టర్. ఒక్కో డైలాగ్‌ను 20 సార్లు చెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనకు పనులు అనుకున్నట్లు జరగాలి, ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడరు. డైలాగ్‌ను కట్‌ చేసి చెప్పడానికి కూడా ఒప్పుకోలేదు. పెద్ద డైలాగ్స్‌ను చాలా సార్లు చెప్పించారు’. ‘ప్రేమ్‌ ఆర్టిస్టుల దగ్గర ఎక్కువ సమయం డబ్బింగ్‌ చెప్పిస్తుంటారు. సన్నివేశానికి తగ్గట్టు వారి స్వరాన్ని పలికిస్తుంటారు. నా గొంతు విభిన్నంగా ఉందని ఈ ప్రాజెక్టుకు తీసుకున్నారు. మరో వ్యక్తికి డబ్బింగ్‌ చెప్పడం కొత్తగా అనిపించింది. ఈ ప్రక్రియను ఎంజాయ్‌ చేశా. ఇంత వరకు నేను నా పాత్రలకు మాత్రమే డబ్బింగ్‌ చెప్పుకున్నా’ అని ఆమె చెప్పారు.

రక్షిత తెలుగు, తమిళం, కన్నడ భాషలతో కలిసి దాదాపు 30 సినిమాల్లో నటించారు. తెలుగులో ‘ఇడియట్‌’ సినిమాతో కథానాయికగా పరిచయమై, హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘పెళ్లాం ఊరెలితే’, ‘నిజం’, ‘శివమణి’, ‘ఆంధ్రావాలా’, ‘అందరివాడు’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.