ప్రియుడి గురించి నోరువిప్పిన హీరోయిన్‌!

0ileana-hotకొన్నాళ్ల క్రితం వరకు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన ఇలియానా.. ఇప్పుడు బాలీవుడ్‌లో నటనపరంగా మంచి పేరు తెచ్చుకుంటోంది. 2012లో ‘బర్ఫీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కమర్షియల్‌, గ్లామరస్‌ హీరోయిన్‌గానూ అడపాదడప చాన్స్‌లు దొరుకుతున్నాయి.

ఇలియానా అందరిలాంటి నటి కాదు. బాలీవుడ్‌లో ఇతర నటీమణుల్లాగా ఆమె తన ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టలేదు. వీలు చిక్కినప్పుడల్లా తన ప్రేమికుడి ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల ఫొటోగ్రాఫర్‌ ఆండ్ర్యూ నీబోన్‌తో ఇలియానా సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ సరదాగా దిగిన ఫొటోలు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా ఇలియానా ‘మిడ్‌-డే’ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తన ప్రియుడి గురించి పలు విషయాలు తెలిపింది. అతని గురించి తరచూ మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని, అతను మామూలుగా ఉండటానికి ఇష్టపడతానని, అతని ప్రైవసీకి భంగం కలిగించకూడదని తెలిపింది.

‘చిత్ర పరిశ్రమలో నేను 11 ఏళ్లుగా కొనసాగుతున్నాను. ఇక్కడి పని సంస్కృతి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నటులుగా మాకు ఎంతో ప్రేమ లభిస్తుంది. అదే సమయంలో కారణం లేకున్నా ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకుంటాం. మేం చేసే వ్యాఖ్యలు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఇదంతా ఆండ్ర్యూ భరించాల్సి రావడం సరికాదనేది నా భావన. అతను సాధారణ వ్యక్తి. ప్రైవసీని ఇష్టపడతాడు. కొంతమంది వచ్చి అతను భారతీయుడు కాదు అంటూ ఏవేవో చెప్తుంటారు. కానీ, అతను నాకు ప్రత్యేకమైన వ్యక్తి. ఏ తప్పు లేకపోయినా నా కుటుంబాన్ని ఒకరు వేలెత్తిచూపే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటాను’ అని ఇలియానా తెలిపింది. మరీ ఆండ్ర్యూను ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి తాము సహజీవనంలో గడుపుతూ ఆనందంగా ఉన్నామని, పెళ్లి, సహజీవనానికి మధ్య భేదం చాలా చిన్నదని పేర్కొంది.