సీఎం బాటలో నడుస్తా: ఎర్రోళ్ల శ్రీనివాస్‌

0kcr-meetsహైదరాబాద్‌: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ప్రభుత్వం మంగళవారం ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌గా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గణపూర్‌కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఐదుగురు సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్‌(సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్‌నాయక్‌(రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పొడగుట్టతండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం రాయగూడ), సుంకపాక దేవయ్య(హైదరాబాద్‌, రాంనగర్‌), చిలకమర్రి నర్సింహా(రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల)లను నియమిస్తూ సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెరాసలో ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా, పార్టీ పొలిట్‌బ్యూరోలోనూ పనిచేశారు. శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై చర్చ సందర్భంగా ఆయనను తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విభజించి విడివిడిగా ఏర్పాటు చేయాలని మొదట తెలంగాణ ప్రభుత్వం భావించింది. దీనికి సాంకేతిక సమస్యలు ఉండడంతో ప్రస్తుతానికి ఉమ్మడిగానే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం బాటలో నడుస్తా: ఎర్రోళ్ల శ్రీనివాస్‌

కొత్తగా నియమితులైన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పాలకమండలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఇతర సభ్యులు మంగళవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. ముఖ్యమంత్రికి పాదాభివందనం చేశారు. తనకు సీఎం గురుతర బాధ్యత అప్పగించారని, తాను జీవితాంతం రుణపడి ఉంటానని, దళిత, గిరిజనుల సంక్షేమం కోసం ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు.