యువతిని మోసం చేసిన ‘బాహుబలి’ ప్రభాస్ పెంపుడు తండ్రి ‘ఐమ్యాక్స్’ వెంకట్ అరెస్టు

0



venkata-prasadయువతిని మోసం చేసిన కేసులో ‘ఐమ్యాక్స్’ ధియేటర్ మేనేజర్, సినీ నటుడు వెంకట ప్రసాద్ (ఐమ్యాక్స్ వెంకట్) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే… బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10లో నివాసముండే ఓ యువతి (33) ప్రసాద్‌ ఐ మ్యాక్స్‌ లో పనిచేస్తోంది. పది సంవత్సరాల క్రితం వివాహం అయినప్పటికీ భర్తతో మనస్పర్ధలు రావడంతో విడిగా ఉంటుంది. కోర్టులో విడాకుల కేసు ఉంది. ఇదిలా ఉండగా ఐమ్యాక్స్‌లో పనిచేసే మేనేజర్‌ వెంకటప్రసాద్‌ కన్ను ఆమెపై పడింది. ఆమెతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు.

ఆమెకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో గత ఏడేళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా పెళ్లి చేసుకునే వరకు పిల్లలు వద్దంటూ రెండు సార్లు గర్భస్రావం చేయించాడు. ఈ క్రమంలో ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్నాడు. ‘బాహుబలి’లో ప్రభాస్ కు పెంపుడు తండ్రిగా నటించాడు. అలాగే తాజాగా విజయం సాధించిన ‘గురుడవేగ’లో సీఎం పిఏగా కూడా నటించాడు. ఇంతలో ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె ఆరాతీయగా, మరో యువతితో తిరుగుతున్నట్టు తెలుసుకుంది. దీంతో ఆమె నేరుగా బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమె…తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తులో చాలా మంది యువతులను మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో పోలీసులు 420, 506,509, 354(డి) కింద కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు.