మెల్ బోర్న్ మబ్బుల్లో మెరుపువే నువ్వు!

0అందం అన్న పదానికే పర్యాయపదం కీర్తి. అందంతో పాటు – అభినయం ఉన్న కథానాయిక. అందుకే మహానటి సావిత్రిగా పరకాయ ప్రవేశం చేయగలిగింది. తమిళ నటి మేనక కుమార్తె – సినిమా ఫ్యామిలీ నుంచి దిగొచ్చిన అందగత్తె అన్న ఒకే ఒక్క అర్హత మాత్రమే కాదు – తనలో అంతకుమించి ఎంతో ఉంది. ఆ సంగతిని కీర్తి విజువల్ ప్రెజెన్స్ అందరికీ అర్థమయ్యేలా చెబుతోంది. ముంబై – గోవా – బెంగళూరు – కోల్ కత .. మెట్రో.. కాస్మోపాలిటన్ నగరాల నుంచి వచ్చిన ఎందరో కథానాయికలకు చుక్కలు చూపిస్తోంది. అందరికీ తీవ్రమైన పోటీనిస్తూ అగ్రస్థానాన్ని కాపాడుకుంటోంది. కీర్తిలో ఉన్న మ్యాటర్ ఎంతంటే.. అంతకుమించి అని చెప్పొచ్చు! ఇప్పుడున్న అరడజను అగ్ర కథానాయికల జాబితా తిరగేస్తే కీర్తి పేరు నంబర్- 1 పొజిషన్ లో ఉంది. తెరంగేట్రం చేసినా నాలుగేళ్లలోనే 2కోట్ల పారితోషికం అందుకున్న కథానాయికగా వెలుగులు విరజిమ్ముతోంది. తన అర్హత తనకి ఈ అగ్ర తాంబూలం కట్టబెట్టింది.

అదంతా సరే.. ప్రస్తుతం కీర్తిసురేష్ గురించి మాట్లాడుకునే మరో అరుదైన సందర్భమిది. మునుముందు రాబోతున్న అవార్డులు రివార్డుల గురించి డిబేట్ మొదలైంది. మహానటిలో సావిత్రిగా అభినయించిన కీర్తికి ఇకమీదట వరుసగా పలు క్రేజీ అవార్డులు దక్కనున్నాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. 2018 -19 సీజన్ కి నంది – జాతీయ అవార్డుల కేటగిరీలోనూ ఈ పేరు కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈలోగానే ఈ అమ్మడు మెల్ బోర్న్ మెరుపులా మెరవబోతోంది. ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక అవార్డుల్ని ఎగరేసుకొస్తుందన్న అంచనాలేర్పడ్డాయి. మహానటితో కీర్తి ప్రతిష్ఠ విశ్వవిఖ్యాతమైంది. ఖండాంతరాల్లో అసాధారణ పాపులారిటీ దక్కింది. ఇది కొత్త దారులకు తెరతీసింది.

మహానటి ఆస్ట్రేలియాలోనూ బంపర్ హిట్. అందుకే ఆస్ట్రేలియా – మెల్ బోర్న్ లో ఈనెల 10 నుంచి 22 వరకూ జరగనున్న`ఇండియన్ ఫిలింఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్(ఐఐఎఫ్ ఎం అవార్డ్స్ -2018) వేడుకల్లో మహానటి స్క్రీనింగుకి వెళుతోంది. అక్కడ కీర్తికి అవార్డుల పంట పండడం ఖాయమని అర్థమవుతోంది. ఇప్పటికైతే ఆస్ట్రేలియాలోని ప్రవాసీల్లో సావిత్రికి ఇవ్వాల్సిన గౌరవం కీర్తి పొందుతోంది. అటువైపు వెళితే.. బాలీవుడ్ నుంచి రాణీ ముఖర్జీ హిచ్ కి బరిలో ఉంది. రాణీజీకి అవార్డు ఖాయమేనన్న మాటా వినిపిస్తోంది. మరో ఇద్దరు అందగత్తెలు మలైకా అరోరాఖాన్ – ఫ్రీదా పింటో ఈ ఉత్సవాల్లో తళుక్కుమననున్నారు. ఆ మేరకు ప్రఖ్యాత తరణ్ ఆదర్శ్ వివరాలందించారు. మెల్ బోర్న్ మబ్బుల్లో కీర్తి సురేష్ తళుక్కున మెరుపులా మెరవబోతోందన్నది మనవరకూ హాట్ టాపిక్.