మోడీ వెళ్లిన గుడి వెనుక ఇంత కత ఉందా?

0ప్రధాని నరేంద్ర మోడీ తరచూ విదేశీ పర్యటనలు చేస్తుంటారు. ఆయన ఫారిన్ టూర్ల కారణంగా దేశానికి జరుగుతున్న లాభం సంగతి పక్కన పెడితే.. ఆయన సందర్శించే ప్రాంతాల మీద ఫోకస్ చేస్తే మాత్రం.. మంచి టూరిస్ట్ ప్లేసులు తెలుస్తుంటాయి. ఓపక్క కర్ణాటక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఎపిసోడ్ నడుస్తున్న వేళ.. ప్రధాని మోడీ నేపాల్ పర్యటనకు వెళ్లటం.. అక్కడ వరుస పెట్టి గుళ్లను సందర్శించిన వైనం అందరి దృష్టిని ఆకర్షించింది.

అలా ఆయన సందర్శించిన టెంపుల్స్ కు సంబంధించి ఆసక్తికరమైన ముచ్చట ఇప్పుడు బయటకు వచ్చింది. నేపాల్ లో ప్రధాని మోడీ సందర్శించిన దేవాలయాల్లో ఒకటి జానకీ మందిర్. దీన్ని నౌ లాఖ్ మందిర్ అని కూడా వ్యవహరిస్తుంటారు. జానకీ మందిర్ అన్నంతనే సీతమ్మకు ఏదో లింకు ఉంటుందని అనుకుంటారు.

నిజమే.. ఆ అంచనా కరెక్టే. ఈ మందిరం స్థల పురాణం ప్రకారం సీతమ్మ పుట్టిల్లు నేపాల్ లోని జనక్ పూర్ అని.. సీతమ్మ తల్లి జనకమహారాజుకు దొరికిన చోటు ఇదేనని.. రామయ్యను పెళ్లాడి అయోధ్యకు వెళ్లే వరకూ ఆ ప్రాంతంలోనే తాను తిరిగిందని చెబుతారు.

ఈ వాదనకు తగ్గట్లే ఈ ప్రాంతంలో 1657లో ఒక బంగారు విగ్రహం దొరికింది. అది సీతమ్మదనే ప్రచారం ఉంది. ఆ ఆలయానికి సమీపంలో వివాహ్ మండప్ అనే పేరుతో ఒక గుడి ఉంది. సీతారాముల పెళ్లి అక్కడే జరిగిందన్న నమ్మిక ఒకటి ప్రచారంలో ఉంది. ఇక.. ఈ జానకీ మందిర్ను నేపాలీలు నౌలాఖ్ మందిర్ గా వ్యవహరిస్తారు.

ఎందుకలా అంటే.. ఈ గుడిని రాణి వృషభాను 1910లో నిర్మించారు. అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించటానికి రూ.999.900 ఖర్చు అయినట్లు చెబుతారు. అందుకే నౌ లాఖ్ మందిర్ అని పిలుస్తారని చెబుతారు. తాజాగా మోడీ కారణంగా ఈ పురాతన ఆలయం ప్రచారంలోకి రావటం.. రానున్న రోజుల్లో ఈ టెంపుల్ ను సందర్శించేందుకు భారత్.. శ్రీలంకల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు వెళ్లటం ఖాయమంటున్నారు.