సమ్మోహనంగా మల్టీస్టారర్

0ఈ యేడాది మల్టీస్టారర్ చిత్రాలకి బాగా అచ్చొచ్చినట్టుంది. ఎవరూ ఊహించని కాంబినేషన్లలో సినిమాలు సెట్స్ పైకి వెళుతున్నాయి. ఇప్పటికే వెంకీ నాగచైతన్యల `వెంకీమామ`తో పాటు… వరుణ్ తేజ్ – వెంకీల `ఎఫ్2` చిత్రాలు సెట్స్ పైకి వెళ్లాయి. త్వరలోనే రామ్ చరణ్ – ఎన్టీఆర్ ల `ఆర్.ఆర్.ఆర్` కూడా మొదలుకాబోతోంది. ఇవి కాకుండా మరో మల్టీస్టారర్కి రంగం సిద్ధమైంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ యాక్షన్ థ్రిల్లర్ కథ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కబోతోంది. ఇప్పటికే కథ పక్కా అయిపోయింది. నటీనటుల ఎంపిక పూర్తవ్వగానే ఆ వివరాల్ని ప్రకటిస్తారు.

ఇటీవల `సమ్మోహనం`తో ఓ మంచి విజయాన్ని అందుకొన్నారు మోహనకృష్ణ. ఆయనకి ఎప్పట్నుంచో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయాలని ఆశ. అందుకోసం సిద్ధం చేసుకొన్న కథని దిల్ రాజుకి చెప్పడం – ఆయన ఓకే అనడం చకచకా జరిగిపోయాయట. ఈ యేడాదే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`తో మల్టీస్టారర్ చిత్రాలకి శ్రీకారం చుట్టింది దిల్ రాజే. ఆయన సంస్థ నుంచే ఇప్పుడు మరిన్ని మల్టీస్టారర్లు తెరకెక్కుతుండడం విశేషం. మహేష్ 25వ సినిమాలో కూడా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలోనూ దిల్ రాజు భాగం పంచుకుంటున్న విషయం తెలిసిందే.