నాగచైతన్యతో సినిమా పక్కా

0రెండేళ్ల కిందట ‘జెంటిల్ మన్’ సినిమాతో మంచి విజయాన్నందుకున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అది మోహనకృష్ణ కెరీర్లోనే అతి పెద్ద కమర్షియల్ హిట్టుగా నిలిచింది. దీని తర్వాత కొంచెం పెద్ద స్థాయి హీరోలు.. నిర్మాతల నుంచి అతడికి పిలుపులొచ్చాయి. ఆ హీరోల్లో అక్కినేని నాగచైతన్య ఒకడైతే.. నిర్మాతల్లో సాయి కొర్రపాటి ఒకరు. ఈ ముగ్గురూ కలిసి ఒక సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు కూడా. కానీ ఏమైందో ఏమో.. తర్వాత ఈ సినిమాకు బ్రేక్ పడిపోయింది. ఇంద్రగంటి లో బడ్జెట్లో ‘అమీతుమీ’ అనే సినిమా తీశాడు. ఆపై ‘సమ్మోహనం’ చేశాడు. మరి చైతూ సినిమా ఏమైందన్నది ఎవరికీ తెలియదు. దీని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇంద్రగంటి స్పందించాడు. తాను చైతూతో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు.

చైతూతో తాను పక్కా యాక్షన్ సినిమా చేయాలనుకున్నానని.. తనకు ఆ జానర్ కొత్త అని.. ఐతే అతను అప్పటికే కమిటైన ‘సవ్యసాచి’ కూడా యాక్షన్ సినిమానే కావడంతో తాను ఆ జానర్లో సినిమా చేయొద్దని భావించి ఆ చిత్రాన్ని ఆపేశామని ఇంద్రగంటి తెలిపాడు. చైతూతో తాను వేరే జానర్లో సినిమా చేస్తానని చెప్పాడు. కానీ అదెప్పుడు ఉంటుందని తెలియదన్నాడు. ఇప్పటిదాకా తాను తీసిన సినిమాలకు ముందుగానే స్క్రిప్టు రెడీ అయిపోయిందని.. కాబట్టి చకచకా సినిమాలు తీసేశానని.. కానీ ఇప్పుడు తన దగ్గర ఏ కథా లేదని ఇంద్రగంటి చెప్పాడు. ఇక కొత్తగా కథల వేట చేపట్టాల్సి ఉందని.. ఒక కథ ఫైనలైజ్ అయ్యాక స్క్రిప్టు పూర్తి చేసి ఎవరితో సినిమా చేయాలో నిర్ణయించుకుంటానని ఇంద్రగంటి తెలిపాడు. తన కొత్త సినిమా ‘సమ్మోహనం’ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఇంద్రగంటి ధీమా వ్యక్తం చేశాడు.