వర్మ చేసిన పనికి కోలుకోలేకపోయా..

0ఇంద్రగంటి మోహన్ కృష్ణ కళాత్మక దర్శకుడు.. గ్రహణం లాంటి అచ్చ తెలుగు క్లాసికల్ మూవీ తీసి నేషనల్ అవార్డు కొట్టాడు. ఇంకొకరేమో మాఫియా- కుట్రలు – కుతంత్రాలు- తెరపై రక్తపాతాలు సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆశ్చర్యకరంగా వీరిద్దరికి జోడి కుదిరింది. ఫిలిం ఇన్ స్టిట్యూల్ లో నంబర్ 1 స్టూడెంట్ గా పేరుతెచ్చుకొని ‘చలి’ లాంటి షార్ట్ ఫిలింతో దూసుకొచ్చాడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఈ షార్ట్ ఫిలిం నచ్చడంతో రాంగోపాల్ వర్మ అవకాశమిచ్చాడు. ఇద్దరూ కలిసి 2004లో ఓ సినిమా తీశారు. సినిమాకు పెట్టుబడి పెట్టిన రాము ఔట్ పుట్ చూసి అవాక్కయ్యాడు. ఇంద్రగంటిని పిలిచి సినిమా చెత్తగా తీశావంటూ చెడామడా తిట్టేశాడట.. అన్నిట్లోనూ నెంబర్ 1గా నిలిచిన ఇంద్రగంటి తొలి సినిమాతోనే అన్ ఫిట్ అని తేల్చేశాడట వర్మ. ఈ విషయాన్ని స్వయంగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రాంగోపాల్ వర్మ అంటే 2004లో ఓ ట్రెండ్ సెట్టెర్ . కంపెనీని స్థాపించి హిందీలో వరుస సినిమాలు తీశారు. అలాంటి ఆయన పిలిచి అవకాశం ఇవ్వడంతో ఇంద్రగంటి కష్టపడి సినిమా తీశాడట.. కానీ ఆ సినిమా వర్మకు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు. ఇలా ఇంద్రగంటి మొదటి సినిమానే విడుదల కాకుండా ఆగిపోవడం.. వర్మ తిట్టడంతో నెల రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట ఇంద్రగంటి.

దీంతో వాళ్ల అమ్మగారు ఇంట్లో కొడుకు బాధ చూసి ‘వర్మ స్టైల్ వేరు.. నీ స్టైల్ వేరు.. నీది కళాత్మక శైలి. నీలాంటి సినిమాలు ఆయనకు నచ్చవు. కొత్తగా ఆలోచించి నువ్వే నీ స్టైల్లో సినిమా తీయి.. లేదంటే పీహెచ్.డీ కంప్లీట్ చేయూ’ అని హిత బోధ చేసిందట. అమ్మ మాటలకు ధైర్యం చేసి ఆ తర్వా త తనికెళ్ల భరణిని కలిసి ‘గ్రహణం’ మూవీ తీశాడు. అది నేషనల్ అవార్డు సంపాదించిపెట్టింది.

తాజాగా ఎన్నో మంచి చిత్రాలు తీశాడు ఇంద్రగంటి.. ఇటీవలే సుధీర్ బాబుతో తీసిన ‘సమ్మోహనం’బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఇక వెనుదిరిగి చూసుకోలేదు ఇంద్రగంటి. కానీ తనను వర్మ రిజెక్ట్స్ చేసిన విధానాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడట.. ‘వర్మ గారంటే నాకెంతో అభిమానం.. ఆయన లాంటి స్టార్ డైరెక్టర్ నాతో సినిమా చేయడమే గర్వకారణం. నా సినిమా వర్మకు నచ్చలేదు. నన్ను తొలగించడం తో బాధపడ్డాను. కానీ నేషనల్ అవార్డు వచ్చాక వర్మ తనను వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందించారు. వర్మ మైండ్ సెట్ వేరు. నా మైండ్ సెట్ వేరు. అందుకే మా ఇద్దరికి జోడీ కుదరలేదు. మా మధ్య వ్యక్తిగత వైరం లేదు. బయట కలిసినప్పుడు అప్యాయంగా మాట్లాడుకుంటామని.. సినిమా పరంగానే మా దారులు వేరు’ అని వర్మలోని కోణాలను ఇంద్రగంటి చెప్పుకొచ్చాడు.