గోవిందం పాట తమిళంలోనూ!

0ఇంకేం ఇంకేం కావాలే… అంటూ గీత కోసం గోవిందం పాడుకొన్న పాట ఆన్ లైన్ లో అదరగొడుతోంది. విడుదలైన వారం రోజుల్లోనే 11 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొంది. విజయ్ దేవరకొండ లాంటి యువ కథానాయకుడి పాట ఆ రేంజ్ లో వ్యూస్ సొంతం చేసుకోవడం నిజంగా సంచలనమే. గోపీసుందర్ ట్యూన్.. అనంతశ్రీరామ్ లిరిక్స్ కలిసి మాయ చేశాయనే చెప్పాలి. అరుదైన ట్యూన్ తో ఆ పాటని చేశారు గోపీసుందర్. `గీత గోవిందం` కోసం స్వరపరిచిన ఆ గీతం ఇప్పుడు తమిళ తంబీలనీ ఊపేస్తుంది. దాంతో వాళ్లు ఆ ట్యూన్ తో తమిళ్ వెర్షన్ చేసుకొని అక్కడ పాడుకొంటున్నారు. తెలుగు పాటలాగే తమిళ్ వెర్షన్ పాట కూడా ఆన్ లైన్ లో అదరగొడుతుండడం విశేషం.

మరి గీత గోవిందం తమిళంలో విడుదలైతే ప్రాచుర్యంలోకి వచ్చిన పాటనే వినియోగిస్తారేమో చూడాలి. విజయ్ దేవరకొండ `నోటా` చిత్రంతో తమిళంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే విజయ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకు కారణం అర్జున్రెడ్డే. ఇప్పటికే అర్జున్ రెడ్డిని తమిళ తంబీలు చాలా మంది చూసి విజయ్ కి అభిమానులయ్యారు. ఇక `నోటా` విడుదలైతే అక్కడ కచ్చితంగా ఆయనకి మార్కెట్ ఏర్పడటం ఖాయం. ఆ దిశగానే విజయ్ ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నట్టు తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహించిన `గీత గోవిందం` ఆగస్టు 15న విడుదలవుతోంది. ఈసినిమా ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. గీతగా రష్మిక మందన్న నటించింది. గోవిందంగా విజయ్ దేవరకొండ నటించాడు. ఈ చిత్రానికి ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది.