సీమ గొడ్డలితో స్వీట్ బ్యూటీ

0రామ్ గోపాల్ వర్మ కథ స్క్రీన్ ప్లే లో సహకారం అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన భైరవగీత ట్రైలర్ వచ్చాక మెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. దానికి తోడు విడుదల తేదీ అక్టోబర్ 12 అని ప్రకటించి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవతో పోటీకి రెడీ అనడం ఇప్పటికే ట్రేడ్ ని షాక్ కి గురి చేసింది. అయినా వర్మ చెప్పాడు కాబట్టి ఇదేదో గొప్పగా ఉంటుందని కాదు కానీ ఇంత సాహసానికి సిద్ధపడుతున్నారంటే కంటెంట్ ఉందేమోనని అనుమానపడుతున్నారు అభిమానులు. సిద్దార్థ తాతోలు దర్శకుడిగా ధనుంజయ్ హీరోగా పరిచయమవుతున్న భైరవగీత ద్వారా ఐర్రా మోర్ ను హీరోయిన్ గా టాలీవుడ్ కు తీసుకొస్తున్నారు. తన పాత్ర తాలూకు స్వభావం చెప్పేందుకు మోర్ మాత్రమే ఉన్న ఓ పోస్టర్ ని విడుదల చేసింది టీమ్. సొగసుగా పద్ధతిగా చీరకట్టుకుని చేతిలో సీమ గొడ్డలితో మొహంపై నెత్తుటి మరకలతో ఎవరిపైకో దూసుకెళ్తున్న ఐర్రా మోర్ ను చూస్తే మంచి పవర్ ఫుల్ గానే కనిపిస్తోంది.

ఈ మధ్య బోల్డ్ కంటెంట్ తో వయొలెన్స్ ఉన్న వాటికి మంచి ఆదరణ దక్కుతున్న నేపధ్యంలో భైరవగీత మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. సీమ నేపధ్యాన్ని తీసుకుని ముఠా కక్షలు ఆధిపత్య పోరు లాంటివాటి మధ్య ఓ ప్రేమ జంట పోరాటాన్ని లింక్ చేసాడు దర్శకుడు ధనుంజయ్. ఇప్పటికే ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ కు చేరువగా వెళ్లి సినిమా మీద ఆసక్తి ఏ రేంజ్ లో ఉందో చెప్పకనే చెబుతోంది. గూఢచారి లాంటి సర్ప్రైజ్ హిట్ కొట్టిన అభిషేక్ సంస్థ దీనికి నిర్మాత కావడం మరో ప్లస్ గా మారుతోంది. తారక్ మూవీ అక్టోబర్ 11 అని ఇంకా అధికారిక ప్రకటన రాక ముందే తాము దానికి పోటీ అని వర్మ ట్విట్టర్ లో ప్రకటించడం ఇప్పటికే టాక్ గా మారింది. మరి వర్మ మాటలు ఎప్పటిలాగే నీటి మీద రాతల్లాగా తేలిపోతాయా లేక దర్శకుడు ఆయన కాదు కాబట్టి ఏమైనా వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి.