వివాదంలో సమంత సినిమా

0
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మామూలు ఆనందంలో లేదు. నెలన్నర కిందటే ‘రంగస్థలం’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ వారాంతంలో రెండు రోజుల వ్యవధిలో మరో రెండు పెద్ద విజయాలు రుచి చూసింది. ద్విభాషా చిత్రం ‘మహానటి’తో పాటు తమిళంలో ఆమె విశాల్ సరసన నటించిన ‘ఇరుంబుతురై’ ఒకే వారాంతంలో విడుదలై పెద్ద విజయాల దిశగా దూసుకెళ్తున్నాయి. తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో రాబోతున్న ‘ఇరుంబుతురై’లో సామ్.. సైక్రియాట్రిస్టు పాత్రలో మెప్పించింది. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. వసూళ్లు కూడా అదిరిపోతున్నాయి. కానీ ఈ సినిమా పెద్ద వివాదంలో చిక్కుకుంది. జనాలకు సంబంధించిన వివిధ రకాలుగా సేకరించే ప్రభుత్వ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లి ఎలా దుర్వినియోగమవుతోందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో జీఎస్టీ.. ఆధార్ కార్డు లాంటి వాటిని ప్రతికూలంగా చూపించడంతో వివాదం తలెత్తింది.

సెన్సార్ సభ్యులు ఇందులోని కొన్ని సన్నివేశాలపై కోత విధించి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారట. కానీ విశాల్ టీం మాత్రం వాటిని తొలగించకుండానే సినిమాను రిలీజ్ చేసేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సినిమాలోని సన్నివేశాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో ఆందోళనలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల షోలు కూడా ఆగిపోయాయి. ఈ విషయమై విశాల్ మీద చర్యలు చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతుండటంతో విశాల్ ఇంటికి పోలీసు భద్రత కల్పించాల్సి వచ్చింది. ఇలాంటి వివాదాల విషయంలో భయపడే రకం కాదు విశాల్. మరి అతను ఎలా స్పందిస్తాడో.. ఈ ఇష్యూను ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఇంతకుముందు విజయ్ సినిమా ‘మెర్శల్’ విషయంలోనూ ఇలాగే వివాదం చెలరేగి.. అది సినిమాకు మాంచి పబ్లిసిటీ తీసుకొచ్చింది. ఆ చిత్రం అనుకున్నదానికంటే పెద్ద విజయం సాధించింది. ‘ఇరుంబు తురై’కి కూడా ఇలాగే ఈ గొడవ కలిసొస్తుందేమో చూద్దాం.