చరిత్ర సృష్టించి, అగ్ర‌రాజ్యాల‌ను దాటేసిన ఇస్రో

0PSLV-C37భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చరిత్ర సృష్టించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సెంటర్‌(షార్‌) నుంచి ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి అగ్ర దేశాలకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ కేంద్రం నుంచి 104 ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహకనౌక 524 కిలోమీటర్లు ప్రయాణించి ఉపగ్రహాలను వాటి నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ- సీ37 వాహకనౌక తన పనిని విజయవంతంగా పూర్తి చేసింది. సరిగ్గా 17.31 నిమిషాలకు కార్టోశాట్‌-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత ఐఎన్‌ఎస్‌-1ఎ, ఐఎన్‌ఎస్‌-1బి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాని తర్వాత అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు, ఇజ్రాయెల్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించాయి. వీటికి సంబంధించి మారిషస్‌లోని ఇస్రో కేంద్రానికి తొలి సంకేతాలు అందాయి.

104 ఉపగ్రహాలు ఒకేసారి
ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే ఇస్రో నూతన అధ్యాయానికి తెరలేపింది. ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ఒకే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపింది. 104 ఉపగ్రహాల్లో అమెరికాకు చెందినవే 96 ఉన్నాయి. ఇందులో డవు ఉపగ్రహాలు 88, లెమర్‌ ఉపగ్రహాలు 8. మిగిలిన వాటిలో ఇజ్రాయెల్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం, మన దేశానికి చెందినవి మూడు ఉపగ్రహాలు ఉన్నాయి. మన దేశానికి చెందిన మూడు ఉపగ్రహాల్లో కార్టోశాట్‌-2 714 కిలోలు, ఐఎన్‌ఎస్‌ 1ఎ, ఐఎన్‌ఎస్‌ 1బి ఉపగ్రహాలు ఒక్కొక్కటీ 15 కిలోల బరువున్నాయి.

ఒక్క రాకెట్టుతో 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి ఇస్రో  చ‌రిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా ఒక్క రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకే అంతరిక్ష నౌక ద్వారా గగనానికి పంపింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అయితే, 29 ఉపగ్రహాలకే తటపటాయించింది. దిగ్గజాల రికార్డుల్నీ తోసిరాజంటూ…  శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి37 ద్వారా మొత్తం నూటనాలుగు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది ఇస్రో. అంతరిక్ష రంగంలో ఇదో మైలురాయి! అందులో నూటొక్క ఉపగ్రహాలు విదేశాలవే. అమెరికా, ఇజ్రాయెల్‌, స్విట్జర్లాండ్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాలు మన సాంకేతిక సాయం తీసుకుంటున్నాయి. అపార అనుభవమూ, అత్యంత చవకైన సేవలు… ఇస్రో ప్రత్యేకత. మిగతా మూడూ – కార్టోశాట్‌-2డి, ఐఎన్‌ఎస్‌-1ఎ, ఐఎన్‌ఎస్‌-1బి… అచ్చంగా మనవే! కార్టోశాట్‌-2డి అత్యాధునిక కెమెరాలతో భూమికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని అందించనుంది. దీని బరువు 730 కిలోలు. మిగతా రెండూ నేవిగేషన్‌ వ్యవస్థకు సాయపడే నానో – ఉపగ్రహాలు. ఒక్కొక్కటీ 15 కిలోల బరువు ఉన్నాయి.