మీ కోసం నా 9 వాగ్దానాలు: జగన్‌ ట్వీట్‌

0వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో ఇచ్చిన వాగ్దానాలపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం ట్విట్‌ చేశారు. మీ కోసం నా తొమ్మిది వాగ్దానాలు ‘అన్న వస్తున్నాడు – నవరత్నాలు తెస్తున్నాడు’ అని చాటి చెప్పాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్లీనరీలో మాట్లాడిన వీడియోను వైఎస్‌ జగన్‌ ట్విట్‌ చేశారు. కాగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తాము అధికారంలోకి రాగానే తొమ్మిది పథకాలను అమలుచేయనున్నట్టు వైఎస్‌ జగన్‌ ప్లీనరీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

రైతులకు ‘వైఎస్‌ఆర్‌ భరోసా’, డ్వాక్రా మహిళలకు ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’, వృద్ధులకు రూ. 2వేల పెన్షన్‌, కొత్తగా 25 లక్షల ఇళ్ల నిర్మాణం, చదువుల కోసం అమ్మ ఒడి పథకం, ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధుల కేటాయింపు, సాగునీరు కోసం జలయజ్ఞం, మద్యనిషేధం.. ఇలా తొమ్మిది పథకాలతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంతోషాలు నింపుతామని ఆయన భరోసా ఇచ్చారు. ‘అన్న వస్తున్నాడు.. మంచిరోజులు వస్తున్నాయ్‌’ అన్న సందేశంతో ఈ తొమ్మిది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.